సరబ్‌కు జర్దారీ క్షమాభిక్ష పెట్టాలి: న్యాయవాది

పాకిస్థాన్‌లో మరణశిక్ష ఎదుర్కొంటున్న భారతీయ ఖైదీ సరబ్‌జీత్ సింగ్‌కు ఆ దేశ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ క్షమాభిక్ష పెట్టాలని అతని తరపు న్యాయవాది శనివారం విజ్ఞప్తి చేశారు. జర్దారీయే సరబ్‌జీత్ మరణ శిక్షను ఎత్తివేయడమో లేదా దానిని యావజ్జీవ శిక్షగా మార్చడమో చేయాలని అతని న్యాయవాది కోరారు.

పాకిస్థాన్ సుప్రీంకోర్టు మూడు రోజుల క్రితం సరబ్‌జీత్ సింగ్ మరణ శిక్షను ఎత్తివేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను తోసిపుచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సరబ్ న్యాయవాది రాణా అబ్దుల్ హమీద్ మాట్లాడుతూ.. పాకిస్థాన్ అధ్యక్షుడు జర్దారీ ఆయన వద్ద ఉన్న పలు క్షమాభిక్ష పిటిషన్‌లపై స్పందించాలని కోరారు.

సరబ్‌జీత్‌కు క్షమాభిక్ష ప్రసాదించాలని కోరుతూ తాము 2006లో పిటిషన్ దాఖలు చేశామని తెలిపారు. అంతేకాకుండా భారత ప్రభుత్వం, అతని కుటుంబం, ఇతర వ్యక్తులు కూడా సరబ్‌జీత్ క్షమాభిక్ష కోసం పలు పిటిషన్‌లు దాఖలు చేశారని చెప్పారు.

పాకిస్థాన్‌లో పంజాబ్ ప్రావీన్స్‌లో 1990నాటి బాంబు పేలుళ్ల కేసులో తీవ్రవాద నిరోధక కోర్టు సరబ్‌జీత్ సింగ్‌ను దోషిగా పరిగణించి మరణ శిక్ష ఖరారు చేసింది. సరబ్ మరణ శిక్షను తొలగించాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించినా ఫలితం కనిపించలేదు. రెండు పర్యాయాలు విచారణకు సరబ్ తరపు న్యాయవాది హాజరుకాకపోవడంతో పాక్ సుప్రీంకోర్టు సరబ్‌జీత్ సింగ్ పిటిషన్‌ను కొట్టివేసింది.

వెబ్దునియా పై చదవండి