చిరంజీవి 150లో నా పాత్ర అలీ చేశాడు : సునీల్‌ ఇంటర్వ్యూ

శనివారం, 30 జులై 2016 (20:58 IST)
కమేడియన్‌గా సునీల్‌ చేస్తున్నప్పుడు చిరంజీవి సినిమాల్లో సమానమైన పాత్రలు పోషించాడు. అయితే హీరోగా మారాక.. చిరంజీవి.. రాజకీయాల్లోకి వెళ్లడంతో.. ఆయనతో కలిసి నటించే అవకాశం రాలేదు. ఎట్టకేలకు మరలా ఆయన సినిమాల్లోకి రావడంతో.. కత్తిలాంటోడులో అవకాశం వచ్చింది. కానీ అప్పుడు వేరే సినిమాలో బిజీగా వుండటంతో ఆ పాత్రను అలీతో చేయించేశారు. ఈ విషయాన్ని సునీల్‌ తెలియజేశాడు. తను హీరోగా నటించిన 'జక్కన్న' చిత్రం విడుదలయ్యాక ఈ విషయాన్ని తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయనతో జరిపిన ప్రత్యేక ఇంటర్వ్యూ..
 
'జక్కన్న' డివైడ్‌ టాక్‌ వచ్చింది కదా?
కొన్ని మాధ్యమాల్లో రివ్యూస్‌ డివైడ్‌గా రాసినా బ్యాక్‌ టు ఎంటర్‌టైన్‌ తరహా మూవీ చేయడమే ఇలాంటి రెస్పాన్స్‌ రావడానికి కారణం. ముఖ్యంగా మహిళలు కుటుంబాలతో వచ్చి బాగా ఎంజాయ్‌ చేస్తున్నారు. చాలావరకు రివ్యూస్‌ మాకు పాజిటివ్‌గానే వచ్చాయి. ఇది రివ్యూస్‌ మూవీ కాదని అనుకుంటున్నాను.
 
ఒక్కరోజు రెస్పాన్స్‌ ఎలా వుంది?
అన్నిచోట్ల నుండి మంచి రెస్పాన్స్‌ వస్తుంది. నా కెరీర్‌లోనే నేను హీరోగా చేసిన సినిమాకు తొలి రోజునే మూడు కోట్ల 75 లక్షల రూపాయల ఓపెనింగ్‌ షేర్‌ రావడం చాలా పెద్ద గ్రేట్‌. నేను అనుకున్న దానికంటే ఎక్కువ రెస్పాన్స్‌ వచ్చింది. ఇది నా అదృష్టంగా భావిస్తున్నాను.
 
హీరో కంటే కమేడియన్‌గా మార్కులు వచ్చాయని రిపోర్ట్స్‌ వస్తున్నాయి?
నేను కామెడికే ఎక్కువ ఇంపార్టెన్స్‌ ఇస్తాను. కథలో ఎక్కడైనా యాక్షన్‌ అవసరమైతే దాన్ని కూడా సిన్సియర్‌గానే చేస్తాను. కమెడియన్‌గా నా కామెడి మిస్‌ అయిన వారి కోసం సాధారణంగా నేను కామెడి ఎలా చేస్తానో అలాగే జక్కన్న సినిమాలో చేశాను. ఎంటర్‌టైనింగ్‌ మూవీస్‌నే ఎక్కువగా చేయాలనుకుంటున్నాను. 
 
అనుభవం లేని దర్శకుడితో ఎలా చేయగలిగారు?
దర్శకుడు వంశీకష్ణతో చాలాకాలంగా మంచి పరిచయం ఉంది. తను అంతకుముందు 'రక్ష' చేశాడు. అది వర్మ సినిమా 'ఫూంక్‌'కు రీమేక్‌. అయినా తను డీల్‌ చేసిన విధానం నచ్చింది. జక్కన్న మెయిన్‌ పాయింట్‌ చెప్పినప్పుడు ఆ ఆలోచన నాకు నచ్చింది. ముఖ్యంగా ఇందులో పెద్ద ఫైట్స్‌ లేవు. నాకు నచ్చింది.. కథను తయారుచేయమన్నాను. తను తయారుచేసి నిర్మాత సుదర్శన్‌ రెడ్డిగారికి కూడా చెప్పాడు. ఆయనకు కూడా నచ్చడంతో సినిమా స్టార్ట్‌ చేశాం.
 
చిరంజీవి 150వ సినిమాలో మిమ్మల్ని అడగలేదా?
అడగలేదా? ఎంతమాట.. అడిగారు. నేనే చేయలేకపోయాను. కారణం.. డేట్స్‌ కుదరలేదు. వారు అడిగినప్పుడు 'ఈడు గోల్డ్‌ ఎహే' సినిమా క్లైమాక్స్‌ షూటింగ్‌ ఉండటంతో అన్నయ్యకు విషయం చెప్పాను. ఆ పాత్రను అలీ చేత చేయించేస్తాం.. పర్వాలేదు. ఇంకో పాత్ర చేద్దువు కానిలే అన్నారు. ఇప్పుడు అన్నయ్య సినిమాలోనే మరో క్యారెక్టర్‌ చేస్తున్నాను. త్వరలో షూటింగ్‌లో పాల్గొనబోతున్నా.
 
హీరోగా పెద్దగా సక్సెస్‌లు లేకపోవడానికి కారణం ఏమని అనుకుంటున్నారు?
కృష్ణాష్టమి.. డిజాస్టర్‌.. ఆ సినిమాకు అనుకున్న రెస్పాన్స్‌ రాలేదు. అయితే.. నన్ను అందరూ.. నా నుంచి కామేడీ ఆశిస్తున్నారని తెలిసింది. అందుకే.. హీరోయిజం కంటే కామెడీ చేసే సబ్జెక్ట్‌లునే ఎంచుకోవాలని నిర్ణయించుకుని 'జక్కన్న' చేశాను. ఇందులో పూర్తి పంచ్‌లతో కూడిన కామెడీ.. అందరూ ఎంజాయ్‌ చేస్తున్నారు.
 
మల్టీప్లెక్స్‌కు నచ్చుతుందంటారా?
మల్టీప్లెక్స్‌ జనాలు.. ఏదో టెన్షన్‌లో రకరకాలుగా వస్తుంటారు. వారు హాపీగా నవ్వలేరు. ఒకవేళ నవ్వువచ్చినా.. చిన్నగా నవ్వేస్తారు. అదే మాస్‌ ప్రేక్షకులు మాత్రం లోపల దాచుకోకుండా బయట పడిపోతారు. అలాంటి వారికి నా సినిమాలు నచ్చుతాయి.
 
'జక్కన్న' అంటే రాజమౌళికి గుర్తుగా పెట్టుకున్నారా?
లేదు. ఆయనకు ఈ టైటిల్‌కు సంబంధమేలేదు. కథ అనుకున్నప్పుడు దీని గురించి రాజమౌళిగారికి, త్రివిక్రమ్‌కూ చెప్పాను.. మొదట్లో 'అగ్గిపుల్ల' అనే టైటిల్‌ అనుకున్నాం.. కథంతా విన్నాక.. జక్కన్న బెటర్‌ అనే అందరూ అన్నారు. ఇందులో నా నిక్‌నేమ్‌ జక్కన్న.. అంతకంటే.. మరే ప్రత్యేకత లేదు.
 
కొత్త సినిమాలు ఎంతవరకు వచ్చాయి?
వీరుపోట్ల దర్శకత్వంలో 'ఈడు గోల్డ్‌ ఎహే' సినిమా చేస్తున్నాను. అది సగానికి పైగా అయింది. ఆ తర్వాత క్రాంతి మాధవ్‌గారి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాను. 20 శాతం పూర్తయింది. త్వరలోనే ఈ సినిమా టైటిల్‌, లోగో ప్రకటిస్తాను.

వెబ్దునియా పై చదవండి