ముగ్గురు మావయ్యలకు చూపిస్తా: హీరో సాయితేజ్ ఇంటర్వ్యూ

బుధవారం, 23 డిశెంబరు 2020 (20:06 IST)
సుప్రీమ్ హీరో సాయితేజ్ హీరోగా ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర బ్యాన‌ర్‌పై బీవీఎస్ఎన్ ప్ర‌సాద్ నిర్మాత‌గా సుబ్బ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రం ‘సోలో బ్రతుకే సో బెట‌ర్‌’. నభా నటేశ్ హీరోయిన్. ఈ చిత్రం మ‌రో ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ జీ స్టూడియో అసోసియేష‌న్‌తో డిసెంబ‌ర్‌ 25న విడుద‌లవుతుంది. ఈ సంద‌ర్భంగా సుప్రీమ్ హీరో సాయితేజ్ ఇంట‌ర్వ్యూ..
 
సాయిధ‌ర‌మ్‌తేజ్... సాయితేజ్‌గా మారాడు కార‌ణం?
ఏమీలేదండి.. ఆ పేరు పెద్ద‌గా వుంద‌ని.. సింపుల్‌గా సాయితేజ్ అయితే బాగుంటుంద‌ని. ప‌రిశ్ర‌మ‌లో సాయి అనీ, తేజ్ అని పిలుస్తుంటారు. అందుకే రెండూ క‌లిపాం. ఇందులో ఎటువంటి న్యూమ‌రాల‌జీ లేదు.
 
ఈ సినిమా చేయ‌డానికి బాగా న‌చ్చిన అంశం ఏమిటి?
సినిమా కాన్సెప్ట్ నాకు బాగా నచ్చింది. కొంత వ‌ర‌కు మ‌న ఫ్రీడ‌మ్ త‌న త‌ల్లిదండ్రుల చేతిలో ఉంటుంది. కొంతమంది ప్రేమిస్తే ఫ్రీడమ్ వారి చేతిలో ఉంటుంది. పెళ్లైన త‌ర్వాత భార్య‌, పిల్ల‌ల చేతిలో ఉంటుంది. ఇలా ఒక‌రి చేతిలో మ‌న ఫ్రీడ‌మ్ ఉండిపోతుంది. దీనికి సంబంధించి సినిమాలో మ‌న ఫ్రీడ‌మ్ మ‌న చేతిలో ఉంటుంది అనే డైలాగ్ కూడా పెట్టాం.
 
ఫిలాస‌ఫీ టచ్ చేసిన‌ట్లుంది?
అవును. అలాగే వుంటుంది. సినిమాలో విరాట్ త‌న ఫిలాస‌ఫీని ఎంత వ‌ర‌కు న‌మ్ముతున్నాడు. దాని వ‌ల్ల త‌న‌కు వ‌చ్చే స‌మ‌స్య‌లు ఏంటి? దాన్ని ఎలా అధిగ‌మించాడు అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
 
ఇందులో మీకు బాగా న‌చ్చిన డైలాగ్‌లు?
ఈ సినిమాలో చాలా స్లోగ‌న్స్ ఉన్నాయి. అందులో కొంతమంది తెలివైనోళ్లు.. చాలా మంది పెళ్లైనోళ్లు.
 
పెళ్లి మీద చాలా సినిమాలు వ‌చ్చాయి? ఇందులో ఏం చెబుతున్నారు?
ఇంత‌కుముందు పెళ్లి వ‌ద్దు అనే అంశం మీద చాలా సినిమాలు వ‌చ్చాయి. ఈ సినిమా వాటికి భిన్న‌మైన సినిమా అని చెప్ప‌ను. కానీ మాన‌వ సంబంధాలు గురించి చెబుతుంది.
  
రియ‌ల్‌ లైఫ్‌లో సోలోగా వుండాల‌నుకుంటున్నారా?
పెళ్లి చేసుకోకూడ‌ద‌ని నేను స్ట్రాంగ్‌గా అనుకున్న‌ప్ప‌టికీ మ‌న కంటే మ‌న అమ్మ‌లు మ‌న‌కు పెళ్లి చేయాల‌నే స్ట్రాంగ్ ఇన్‌టెన్ష‌న్‌తో ఉంటారు. మ‌నం వ‌ద్దు అని ఎంత అనుకున్నా చివ‌ర‌కు వాళ్లే గెలుస్తారు. అయితే వీలైనంత కాలం మ‌నం బ్యాచ్‌ల‌ర్ లైఫ్‌ను పొడిగించ‌డం చేయ‌గ‌ల‌మంతే. ప్ర‌స్తుతం లాక్‌డౌన్ వ‌ల్ల నాకు ఏడాదిన్న‌ర కాలం బ్యాచ్‌ల‌ర్ లైఫ్ ఎక్స్‌టెండ్ అయ్యింది.
 
మీకిష్ట‌మైన పాట‌లేమిటి?
త‌మ‌న్‌తో ఐదో సినిమా చేస్తున్నాను. పాట‌లు చాలా బాగా వ‌చ్చాయి. నో పెళ్లి, హే ఇది నేనేనా, అమృత సాంగ్‌, రీసెంట్‌గా రిలీజైన టైటిల్ ట్రాక్ ఇలా అన్నింటికీ ప్రేక్ష‌కుల నుండి అమేజింగ్ రెస్పాన్స్ వ‌చ్చింది.
 
పెళ్లి సాంగ్ రిలీజ్ చేసిన వారికి పెళ్ల‌యిపోయింది. మ‌రి మీకేమని‌పిస్తుంది?
ఇందులో నో పెళ్లి సాంగ్‌ను నితిన్ బ్యాచ్ ల‌ర్ పార్టీకో, లేక సంగీత్‌లోనో గిఫ్ట్‌గా ఇద్దామ‌ని అనుకున్నాం. కాని అది నిఖిల్‌, రానాకు కూడా క‌లిసొచ్చింది. ప‌ర్స‌న‌ల్‌గా నాకు బాగా న‌చ్చిన సాంగ్ కూడా ఇదే.. మా ఇంట్లో రోజూ సుప్ర‌భాతం త‌ర్వాత మా అమ్మ‌కు విన‌ప‌డేలా ఎక్కువ సౌండ్‌తో ఇదే ప్లే చేస్తూ ఉంటాను( న‌వ్వుతూ)
 
థియేట‌ర్‌లో ఆద‌ర‌ణ ఎలా వుంటుంద‌నుకుంటున్నారు?
సినిమా కంటెంట్‌పై చాలా స్ట్రాంగ్‌గా ఉన్నాం. మంచి ఎంట‌ర్‌టైనర్‌. లాక్డౌన్‌లో మ‌నం చాలా వ‌ర‌కు  థ్రిల్ల‌ర్స్ చూసుంటాం. కాని ప్రాప‌ర్ ఎంట‌ర్ టైన‌ర్, ఫ్యామిలీ అంతా క‌లిసి లేదా ఫ్రెండ్స్ అంద‌రూ క‌లిసి హ్యాపీగా ఎంజాయ్ చెయ్యొచ్చు.
 
చాలామంది హీరోలు వ‌స్తున్నారు? న‌టుడిగా ఏమ‌నిపిస్తుంది?
ఒక యాక్ట‌ర్‌గా, తెలుగు ఫిలిం ఇండ‌స్ట్రీలో భాగంగా నాకు రెస్పాన్సిబిలిటీ పెరిగింది.
 
ద‌ర్శ‌కుడు సుబ్బు క‌థ ఎప్పుడు చెప్పారు?
గ‌తేడాది జూన్‌లో సుబ్బు ఈ క‌థ చెప్ప‌డం జ‌రిగింది. అప్ప‌టి నుండి త‌ను ఈ స్క్రిప్ట్ మీద వ‌ర్క్ చేస్తూ వ‌చ్చాడు. అప్పుడు నేను ప్ర‌తి రోజూ పండ‌గే షూటింగ్‌లో ఉన్నాను. అది అయిపోగానే వెంట‌నే షూటింగ్ స్టార్ట్ చేశాం.
 
డిసెంబ‌ర్ 25 మీకోస‌మే ఆగిన‌ట్లుంది. థియేట‌ర్లు ఓపెన్ అవుతున్నాయి?
మే1 సినిమాని విడుద‌ల చేద్దాం అనుకున్నాం కాని లాక్‌డౌన్ వ‌ల్ల `ప్ర‌తి రోజూ పండుగే` విడుద‌లైన డిసెంబ‌ర్ 25న సోలో బ్ర‌తుకే సో బెట‌ర్ సినిమా కూడా విడుద‌ల‌వుతుంది. ప్ర‌స్తుతం ఈ క‌రోనా వ‌ల్ల కష్టాల్లో ఇండ‌స్ట్రీకి ఈ సినిమా బాగా ఆడితే కొంత రిలీఫ్ దొరుకుతుంది అని ముందుకు రావ‌డం జ‌రిగింది.
 
పెళ్లి విష‌యంలో ప్ర‌స్తుతం యూత్ ఆలోచ‌న‌లు, అలాగే వారి త‌ల్లితండ్రుల ఆలోచ‌న‌లు ఎలా ఉన్నాయి అనే రెండు అంశాల‌ను తీసుకుని ఎంట‌ర్టైన్‌మెంట్‌తో పాటు ఫ్యామిలీ ఎమోష‌న్స్‌ని సుబ్బు చ‌క్క‌గా తెర‌కెక్కించాడు.
 
ఈ పాత్ర నిజ‌జీవితానికి ద‌గ్గ‌ర‌గా వుంటుందా?
విరాట్ పాత్ర నా నిజ జీవితానికి చాలా ద‌గ్గ‌ర‌గా ఉంటుంది. ఇదే అని కాదు `చిత్రల‌హ‌రి` నుండి చాలా వ‌ర‌కూ నాకు ప‌ర్స‌న‌ల్‌గా క‌నెక్ట్ అయ్యే క‌థ‌లే వ‌స్తున్నాయి. త‌ను న‌మ్మిన ఫిలాసిపి కోసం ఫైట్ చేస్తున్న ఒక యువ‌కుడికి ఎలాంటి ఇబ్బందులు ఎదుర‌య్యాయి? వాటిని ఎలా ఎదుర్కొన్నాడు అనేదే సినిమా క‌ధ‌.
 
ఆర్‌. నారాయ‌ణ‌మూర్తిగారి ప‌ర్మిష‌న్ ఎందుకు తీసుకున్నారు?
ఈ క‌థ విన్న‌వెంట‌నే ఆర్ నారాయ‌ణ మూర్తిగారి ప‌ర్మీష‌న్ తీసుకోవాలి అనుకున్నాం. ఎందుకంటే ఆయ‌న్ను కొంత వాడుకున్నాం అని చెప్పాలి. ట్రైల‌ర్‌లో అది మీకు క‌నిపిస్తుంది. సింగిల్‌గా వున్న వారంద‌రినీ ఇందులో చూపించాం. ఆయ‌న డైలాగ్‌లు కూడా వుంటాయి. అందుకే ఆయ‌న ద‌గ్గ‌రికైతే మ‌న‌కు యాక్సెస‌బిలిటీ చాలా తొంద‌ర‌గా దొరుకుతుంది అనుకున్నాను.
 
వెంట‌నే సుబ్బు తీసుకున్నాను అని చెప్పాడు. మూర్తి గారు కూడా చాలా స్పోర్టివ్‌గా తీసుకుని మ‌న ఇండ‌స్ట్రీ కొసం మ‌నం త‌ప్ప‌క నిల‌బ‌డాలి త‌ప్ప‌కుండా సినిమా చెయ్యండి అని చాలా స‌పోర్టివ్‌గా మాట్లాడాడు. ఆయ‌నను ఎప్పుడు క‌లిసినా సినిమా ఎలా వ‌స్తుంది బాగా చెయ్యండి అనే చెప్పారు. ఆయ‌న స‌పోర్ట్ వ‌ల్లే సినిమా ఇంత‌బాగా వ‌చ్చింది.
 
న‌భా ఎలా న‌టించింది?
ఈ సినిమాలో నేను ఎంత‌వ‌ర‌కూ జెన్యూన్‌గా ఉన్నాను అని టెస్ట్ చేస్తూ ఉండే పాత్ర‌లో న‌భ చాలా బాగా న‌టించింది. త‌న క్యారెక్ట‌ర్ కూడా చాలా ఎంట‌ర్టైనింగ్‌గా ఉంటుంది.
 
మామ‌య్య‌లు షో చూశారా?
కుదిరితే ముగ్గురు మామ‌య్య‌ల‌కు ఒక స్పెష‌ల్ షో వేయ‌డానికి ప్లాన్ చేస్తున్నాం
 
కొత్త క‌మిట్మెంట్‌లు?
దేవా కట్టా దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నా. ఇప్పటికే 60 శాతం మేజ‌ర్ పార్ట్ షూటింగ్ పూర్తయింది. ఏలూరు, కొల్లేరు సరస్సు చుట్టు పక్కల ప్రాంతాల్లో చిత్రీకరణ చేయాల్సి ఉంది.  ఆ సినిమాలో సోష‌ల్ రెస్పాన్సిబిలిటీ ఉన్న ఒక యువ ఐఏఎస్ ఆఫీస‌ర్‌గా కనిపిస్తా. అలాగే సుకుమార్ గారి శిష్యుడు ద‌ర్శ‌క‌త్వంలో ఓ మిస్టిక‌ల్ థ్రిల్ల‌ర్ సినిమా చేస్తున్నాను. 2021లో రెండు సినిమాలు విడుద‌ల‌చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నాను.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు