క్యారెక్టర్ ఆర్టిస్టు అనేది సినిమాల్లో నాకు పునాది.. దాన్ని వదలను: శ్రీనివాసరెడ్డి
బుధవారం, 16 నవంబరు 2016 (12:16 IST)
తాను క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ కమేడియన్‌గా చేస్తూ.. హీరోగా ఎదిగాననీ.. ఇది అనుకోకుండా వచ్చిన అవకాశమనీ. ఇతర చిత్రాల్లో క్యారెక్టర్లు చేస్తూనే ఉంటానని శ్రీనివాసరెడ్డి అంటున్నారు. 'గీతాంజలి'లో పూర్తిస్థాయి కథానాయకుడని చెప్పను కానీ 'జయమ్ము నిశ్చయమ్మురా'లో పూర్తి స్థాయి హీరోగా నటించానని అంటున్న ఆయన పుట్టినరోజు ఈనెల 16. ఈ సందర్బంగా ఆయనతో చిట్‌చాట్.
* హీరోగా ఎన్నో సినిమా?
మొదటిదే.. గీతాంజలిలో హీరోనుకాను. కథలో ప్రముఖ పాత్ర అంతే.. హీరోయిజం అనేది అందులో వుండదు.
* 'జయమ్ము నిశ్చయమ్మురా' అనే టైటిల్ ఎలా పెట్టారు?
ముందుగా కథలోని పాత్ర పేరు సర్వమంగళం. దాన్ని టైటిల్‌గా అనుకున్నాం. కానీ.. లోగడ.. రమణారెడ్డి ఓ సినిమాలో.. అన్నీపోయాయి.. సర్వమంగళం అయిందంటూ... పాట పాడతారు. ఈ పేరు పెడితే.. ఏదైనా నెగెటివ్ అయితే.. కొన్ని బయ్యర్‌కూ చెప్పుకోవడానికి అసహ్యంగా ఉంటుందని.. నేను చెప్పుకోవడానికి ఆ పేరు బాగోదని...'జయమ్ము నిశ్చయమ్మురా' పెట్టాం.
* అసలు కథేమిటి?
కరీంనగర్‌కు చెందిన ప్రభుత్వోద్యోగి సర్వమంగళం. తను కాకినాడ బదిలీ అవుతాడు. ఉద్యోగరీత్యా ట్రాన్స్‌ఫర్ కోసం ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడు. వాటి నుండి ఎలా అదిగమించాడనేదే కథ. సర్వమంగళం సర్వేష్ కుమార్ ఎలా అయ్యాడనేదే కథ. జంధ్యాల గారి స్టయిల్లో ఉండే చక్కటి కామెడితో అహ్లాదంగా నడిచే సినిమా ఇది. కోర్టు సన్నివేశం మినహా మిగతావన్నీ సహజమైన లోకేషన్స్‌లోనే సినిమాను
చిత్రించాం. సినిమా ఎక్కువగా అవుట్‌డోర్‌లోనే చేశాం.
* 'దేశవాళీవినోదం' అంటే?
మన ట్రెండ్‌కు సంబంధించినది మన మూలాలు మర్చిపోతున్నాం. బయట ఎరువు తెచ్చుకున్న హాస్యం.. సన్నివేశాలు లేకుండా.. తెలుగు తనం వుట్టిపడేట్లుగా చిత్రాన్ని తీర్చిదిద్దాం. అందుకే అలా పెట్టాం. ఈ సినిమాలో తత్కాల్ క్యారెక్టర్, గుంటూరు పంతులు పాత్ర, ఇలా అన్ని పాత్రలు మన చుట్టూ ఉన్నట్టుగానే కనపడతాయి. ట్రాక్‌లో నుండి పుట్టిన కామెడి కాదు... కామెడి కథలోనే నుండి పుట్టింది. మనమేదైతే మిస్ అవుతున్నామో దాన్ని గుర్తుకు తేవడానికే దేశవాళి వినోదం అనే క్యాప్షన్ పెట్టాం.
* తెలంగాణ నుంచి ఆంధ్రాకు వచ్చే కథేనా?
ఇది 2013లో రాసుకున్న కథ. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల ప్రజలు కలిసి ఉన్న నేపథ్యంలో జరిగే కథ. అది జనాలకు అర్థమయ్యేలా చెప్పడానికి 'అత్తారింటికి దారేది' అనే సినిమాను ఇందులో ఓ క్యారెక్టర్‌గా పెట్టడం జరిగింది. ఎందుకంటే 2013లో అది పెద్ద హిట్ మూవీ. నా ప్రేమ కథంతా అత్తారింటికి దారేది క్యారెక్టర్ సమక్షంలోనే జరుగుతుంది.
* 'గీతాంజలి' తర్వాత చాలా గ్యాప్ వచ్చిందే?
'గీతాంజలి' తర్వాత నాకు హర్రర్ సినిమాల కథలే చేయమని వచ్చాయి. దాదాపు 80 కథలు విన్న తర్వాత ఓ సినిమాలో నటించడానికి రెడీ అయ్యాను. ఆ సినిమా లుక్‌ను బన్నీకి పంపితే 'హర్రర్ స్టార్ జిందాబాద్' అని మెసేజ్ పెట్టాడు. హర్రర్ సినిమాలే చేస్తే హర్రర్ స్టార్ అంటారని దాని సారాంశం. దాంతో ఆ సినిమా ముందుకెళ్లలేదు. హీరోగానే కంటిన్యూ కావాలనే ఆలోచన నాకు లేదు. నేను క్యారెక్టర్స్ వేసుకుంటూ ఉన్నాను. అందుకే గ్యాప్ వచ్చింది.
* మీరి ఈ కథ ఎలా మీ దగ్గరకువచ్చింది?
ఓసారి జె.డి.చక్రవర్తి నాపేరు సూచించారంటూ నా ఫ్రెండ్ ఫోన్ చేశారు. కానీ నేను జె.డి.తో కలిసి సినిమా చేయలేదు. మాట్లాడలేదు. కానీ ఆయన నన్ను ఊహించుకుని కథ నా వద్దకు పంపారంటే ఏదో ఉందని కథ వినడానికి దర్శకుడిని రమ్మన్నాను. కథ విన్నాక నేను నా సినిమాల్లో ఎలా అయితే ఉండాలనుకున్నానో ఆ ఎలిమెంట్స్ ఉండటంతో ఈ ప్రాజెక్ట్‌లో ఇన్‌వాల్వ్ అయ్యాను. అయితే.. ఇది అదృష్టంగా చబుతాను. ఈ కథను ఇద్దరు హీరోలవద్దకు వెళ్ళింది. కానీ తిరిగి నా దగ్గరకు రావడం.. నాకు సూటవటం జరిగాయి.
* పూర్ణ పాత్ర ఎలా వచ్చింది?
కథ ప్రకారం రాణి అనే పాత్రకు తెలుగు నెటివిటీ ఉన్న హీరోయిన్‌లా అనిపించాలని పూర్ణగారు బావుంటారనిపించి ఆమెను కలవడం, ఆమెకు కథ నచ్చడంతో ఆమె నటించడానికి ఓకే చెప్పారు. అంతకుముందు ఆమె 'అవును'లో నటించింది.
* క్యారెక్టర్లు మానేస్తారా?
ఈ సినిమా ముందు నేను ఇతర సినిమాల్లో చాలా క్యారెక్టర్స్ చేశాను. నటుడుగా నాకంటూ గుర్తింపు వచ్చింది క్యారెక్టర్ ఆర్టిస్టుగానే, కాబట్టి వాటిని నేను వదల్లేదు. వాటిని మిస్ కాకుండా కెరీర్ ప్లాన్ చేసుకోవాలి. క్యారెక్టర్సే నాకు మెయిన్.
* దర్శకుడు శివరాజ్ కనుమూరి గురించి?
దర్శకుడు శివరాజ్ కనుమూరి వర్మగారు, జేడీ, ఇంద్రగంటి మోహనకష్ణ వద్ద పనిచేశారు. లండన్‌లో ఓ కంపెనీ సి.ఇ.ఓ రేంజ్‌లో వర్క్ చేసి బాగా డబ్బులు సంపాదించుకుని, ఫ్యామిలీని అంతా సెట్ చేసి తన డబ్బులతోనే సినిమా చేయాలని వచ్చారు. పెద్ద హీరోతో సినిమా చేయాలని వచ్చారు. అయితే పెద్ద హీరోతో సినిమా చేయాలంటే ముందు తనెంటో ప్రూవ్ చేసుకోవాలని జయమ్ము నిశ్చయమ్మురా కథ రాసుకున్నారు. అలా తనకు నచ్చిన విధంగా సినిమా చేయాలని ఓ ప్లానింగ్‌లో సినిమాను పూర్తి చేశారు. ఆయన ఏ ధైర్యంతో సినిమా చేశాడో, ఆ ధైర్యంతో బిజినెస్ కూడా పూర్తయ్యింది.