చెన్నై ఖాతాలో మరో ఓటమి : జట్టును ఒంటి చేత్తో గెలిపించిన కోహ్లీ

ఆదివారం, 11 అక్టోబరు 2020 (12:53 IST)
ఐపీఎల్ టోర్నీలో భాగంగా, చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్ల మధ్య కీలక మ్యాచ్ శనివారం జరిగింది. ఇందులో చెన్నై జట్టు మరోమారు ఓడిపోయింది. బెంగుళూరు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ తన జట్టును ఒంటి చేత్తో గెలిపించాడు. 
 
ఐపీఎల్‌-13లో శనివారం జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బెంగుళూరు జట్టు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ 52 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 90 (నాటౌట్) పరుగులు చేసి అజేయ అర్థసెంచరీతో ఆకట్టుకున్నాడు. దేవ్‌దత్‌ పడిక్కల్‌ 33 బంతుల్లో రెండు బౌండరీలు, ఓ సిక్స్‌తో రాణించాడు. 
 
ఫలితంగా బెంగళూరు 4 వికెట్లకు 169 పరుగులు చేసింది. ఇన్నింగ్స్‌ ఆద్యంతం క్రీజులో నిలిచిన కెప్టెన్‌ విరాట్‌ చెన్నైపై యధేచ్ఛగా విరుచుకుపడి జట్టుకు మెరుగైన స్కోరు అందించాడు. చెన్నై బౌలర్లలో శార్దుల్‌ ఠాకూర్‌(2/40) రెండు వికెట్లు తీయగా.. శామ్‌ కరణ్‌, దీపక్‌ చాహర్‌ చెరో వికెట్‌ పడగొట్టారు. 
 
ఆ తర్వాత 170 పరుగుల ఛేదనలో బెంగళూరు బౌలర్లు వాషింగ్టన్‌ సుందర్‌(2/16), క్రిస్‌ మోరీస్‌(3/19)ల ధాటికి చెన్నై నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లకు 132 పరుగులే చేసింది. అంబటి రాయుడు 40 బంతుల్లో 4 ఫోర్లు 42 పరుగులు చేయగా, జగదీశన్ 28 బంతుల్లో 4 ఫోర్ల సాయంతో 33 రన్స్ మినహా మిగతా బ్యాట్స్‌మెన్‌ వైఫల్యంతో మూల్యం చెల్లించుకుంది.
 
వాస్తవానికి చెన్నై లక్ష్య ఛేదన పేలవంగా సాగింది. మ్యాచ్ నాలుగో ఓవర్లో డుపెస్లిస్(8)‌.. క్రిస్‌ మోరీస్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరగ్గా.. ఐదో ఓవర్లో ప్రమాదకర షేన్‌ వాట్సన్(14)‌ బౌల్డ్‌ అయ్యాడు. తొలి 10 ఓవర్లకు చెన్నై స్కోరు 47/2తో కష్టాల్లో పడింది. 
 
ఈ దశలో అంబటి రాయుడు, జగదీశన్‌ బెంగళూరు బౌలర్లను ధాటిగా ఎదుర్కొంటూ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. సాధించాల్సిన రన్‌రేట్‌ ఎక్కువగా ఉండటంతో బ్యాట్స్‌మెన్‌ తీవ్ర ఒత్తిడిలో ఉన్నారు. లక్ష్యం దిశగా సాగుతున్న సమయంలో నవదీప్‌ సైనీ వేసిన 15వ ఓవర్లో  జగదీశన్‌ వికెట్ల మధ్య నిర్లక్ష్యంగా పరుగెత్తి రనౌటయ్యాడు. దీంతో మూడో వికెట్‌కు 64(52 బంతుల్లో) పరుగుల భాగస్వామ్యం ముగిసింది. 
 
ఈ దశలో కెప్టెన్‌ ధోనీ(10) అలా వచ్చి ఇలా వెళ్లిపోయాడు. 30 బంతుల్లో 74 పరుగులు చేయాల్సిన సమయంలో చాహల్‌ బౌలింగ్‌లో భారీ సిక్సర్‌ బాదిన మహీ.. ఆ ఓవర్‌ ఆఖరి బంతికే లాంగాఫ్‌లో గుర్‌కీరత్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. క్రిస్‌ మోరీస్‌ వేసిన తర్వాతి ఓవర్‌ రెండో బంతికే తాను ఎదుర్కొన్న మొదటి బంతికే శామ్‌ కరన్‌(0) వికెట్‌ కీపర్‌ క్యాచ్‌కు ఔటయ్యాడు. 
 
ఒంటరి పోరాటం చేస్తున్న రాయుడు కూడా ఉడాన బౌలింగ్‌లో బంతిని వికెట్ల మీదకు ఆడుకొని పెవిలియన్‌ చేరాడు. డ్వేన్‌ బ్రావో(7), జడేజా(7) రెచ్చిపోయే ప్రయత్నం చేసినా క్రిస్‌మోరీస్‌ వెనువెంటనే పెవిలియన్‌ పంపి చెన్నై కథ ముగించాడు. ఫలితంగా చెన్నై జట్టు 37 పరుగుల తేడాతో విజయభేరీ మోగించాడు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు