ఐపీఎల్ 2020 : హైదరాబాద్ వర్సెస్ కింగ్స్ పంజాబ్ .. మరో ఆసక్తికరమైన మ్యాచ్
గురువారం, 8 అక్టోబరు 2020 (17:18 IST)
ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నీలో భాగంగా గురువారం రాత్రి మరో ఆసక్తికరమైన మ్యాచ్ జరుగనుంది. గత మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ చేతిలో ఓడిన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు గురువారం జరిగే మ్యాచ్‌లో కింగ్స్ లెవెన్ పంజాబ్ జట్టుతో తలపడనుంది. ఈ మ్యాచ్‌కు దుబాయ్ వేదికకానుంది.
ముఖ్యంగా, ఎన్నో గంపెడాశలు పెట్టుకున్న హైదరాబాద్ జట్టు కెప్టెన్ ఇప్పటివరకు పేలవ ప్రదర్శనతో నిరాశపరిచాడు. దీంతో పంజాబ్‌తో జరిగే మ్యాచ్‌లో రాణించి, జట్టును గెలిపించాలన్న పట్టుదలతో ఉన్నాడు.
నిజానికి వరుస ఓటములతో లీగ్‌ను మొదలుపెట్టిన సన్‌రైజర్స్ విజయాల బాట పట్టిందనుకున్న తరుణంలోనే గత మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ చేతిలో అనూహ్యంగా ఓడిపోయింది.
సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ దూరం కావడం హైదరాబాద్‌కు ఎదురుదెబ్బగా మారింది. బ్యాటింగ్ విషయంలో సన్‌రైజర్స్ పటిష్ఠంగానే ఉంది. అయితే, విజయం సాధించాలంటే ఆరంభ, డెత్ ఓవర్లలో బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పాటు బ్యాట్స్‌మెన్ సమిష్టిగా రాణించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
మరోవైపు ఐదు మ్యాచ్‌ల్లో ఒకటే గెలిచిన పంజాబ్ ఎలాగైనా గెలువాలని పట్టుదలగా ఉంది. మ్యాచ్‌లో మార్పులుండే అవకాశం కనిపిస్తోంది. వరుసగా విఫలమవుతున్న గ్లెన్ మ్యాక్స్‌వెల్‌కు బదులుగా హార్డ్ హిట్టర్ క్రిస్ గేల్ తుది జట్టులోకి వచ్చే అవకాశముంది.
సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ సారథ్యంలోని పంజాబ్ ఒత్తిడిని తట్టుకొని నిలబడాల్సి ఉంది. బౌలింగ్ వైఫల్యమే పంజాబ్ ప్రధాన సమస్యగా మారింది. బౌలర్ల నిలకడలేమి ప్రదర్శనతోనే ఆ జట్టు ఓటమిపాలవుతోంది.
కాగా, ఈ ఇరు జట్లు మొత్తం 14 సార్లు తలపడగా హైదరాబాద్ జట్టు 10 సార్లు, పంజాబ్ జట్టు కేవలం నాలుగుసార్లు మాత్రమే విజయం సాధించింది.
తుది జట్ల అంచనా..
హైదరాబాద్.. డేవిడ్ వార్నర్ (కెప్టెన్), జానీ బైర్‌స్టో, మనీష్ పాండే, విలియంసన్, ప్రియాన్ గార్గ్, అభిషేక్ శర్మ, అబ్దుల్ సమద్, రషీద్ ఖన్, బాసిల్ తంపి, టి. నటరాజన్, సందీప్ శర్మ.