ఐపీఎల్‌ : 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌'లు అధికంగా ఎవరు గెలుచుకున్నారు?

శుక్రవారం, 11 సెప్టెంబరు 2020 (18:44 IST)
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)కు ఉన్న ఆదరణ అంతా ఇంతాకాదు. ఇదో పెద్ద కార్నివాల్. ఈ సీజన్ మ్యాచ్‌లు ఈ నెల 19వ తేదీ నుంచి ప్రారంభంకానున్నాయి. ఏప్రిల్ - మే నెలల్లో జరగాల్సిన ఈ టోర్నీ కరోనా వైరస్ కారణంగా ఈ నెలలో ప్రారంభంకానుంది. ఇది నవంబరు పదో తేదీ వరకు జరుగనుంది. నిజానికి ఈ లీగ్ టోర్నీ చరిత్రలో 129 మంది ఆటగాళ్లు ఈ అవార్డుల‌ను అందుకున్నారు. అందులో కొంత‌మంది ప్లేయ‌ర్స్ ఎక్కువ సార్లు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును గెలుచుకున్నారు. ఇప్ప‌టివ‌ర‌కు అత్య‌ధిక అవార్డులు గెలుచుకున్న ఐదుగురు ఆట‌గాళ్ల గురించి తెలుసుకుందాం. 
 
ఈ కోవలో చెప్పుకోవాలంటే తొలుత వెస్టిండీస్ ఆటగాడు క్రిస్ గేల్ మొదటి వరుసలో ఉంటాడు. ఐపీఎల్ చ‌రిత్ర‌లో ఈ క‌రేబియ‌న్ స్టార్ ఎన్నో ఘ‌న‌త‌ల‌ను సాధించాడు. టోర్నమెంట్ చరిత్రలో అత్యధికంగా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులను క్రిస్ గేల్ గెలుచుకున్నాడు.
 
125 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన గేల్ ఇప్ప‌టివ‌ర‌కు 21 మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు గెలుచుకున్నాడు. గేల్ ఆరు సెంచ‌రీలు, 11 అర్థ సెంచ‌రీలు సాధించాడు. మొద‌ట ఆర్‌సీబీ త‌ర‌పున ఆడిన గేల్‌ను 2018లో పంజాబ్ జ‌ట్టు రూ.2 కోట్ల‌కు కొనుగోలు చేసుకుంది. 
 
ఆ తర్వాత రెండో స్థానంలో సౌతాఫ్రికా ఆటగాడు డివిలియర్స్. గేల్ త‌ర్వాత ఆర్‌సీబీ స్టార్ ప్లేయ‌ర్ ఏబీ డివిలియ‌ర్స్ 20 ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు గెలుచుకున్నాడు. కానీ జ‌ట్టు మాత్రం ఇప్ప‌టివ‌ర‌కు ఐపీఎల్ ట్రోఫీ గెలువ‌లేక‌పోయింది. 142 ఐపీఎల్ ఇన్నింగ్స్ ఆడిన డివిలియ‌ర్స్ ఇప్ప‌టివ‌ర‌కు 20 ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ట్రోఫీలను అందుకున్నాడు. డివిలియర్స్ మూడు సెంచరీలు, 16 అర్థ సెంచరీలు బాదాడు.
 
ఇకపోతే, మూడో స్థానంలో డేవిడ్ వార్నర్ ఉన్నాడు. డివిలియర్స్ తర్వాత సన్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్న‌ర్ 17 ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ట్రోఫీలను అందుకున్నాడు. వార్న‌ర్ మొత్తం 126 మ్యాచ్‌లు ఆడి, 14 హాఫ్ సెంచ‌రీలు, మూడు సెంచ‌రీలు చేశాడు.
 
చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ... ఇప్పటివరకు మొత్తం 17 మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు అందుకున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ కోసం ధోని చాలాసార్లు మ్యాచ్ విన్న‌ర్‌గా నిలిచాడు. 170 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన ధోని 13 అర్థ సెంచరీలు కొట్టాడు. ఎన్నో మ్యాచ్‌లను ఒంటి చేత్తో గెలిపించాడు.
 
ఇక చివరగా, రోహిత్ శర్మ. ప్రస్తుతం ముంబై ఇండియన్స్ కెప్టెన్. ఐపీఎల్ టైటిళ్లతో రోహిత్ శర్మ అత్యంత విజ‌య‌వంత‌మైన కెప్టెన్‌గా పేరు తెచ్చుకున్నాడు. ఇప్ప‌టివ‌ర‌కు 183 ఐపీఎల్ ఇన్నింగ్స్‌లు ఆడిన రోహిత్.. 17 మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు గెలుచుకున్నాడు. ఐపీఎల్ కెరీర్‌లో ఒక సెంచరీ, 14 అర్థ సెంచరీ కొట్టాడు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు