బీసీసీకు కాసుల వర్షం కురిపించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 13వ అంచె పోటీలు ఈ నెల 19వ తేదీ నుంచి దుబాయ్ వేదికగా జరుగనున్నాయి. ఈ టోర్నీ కోసం మొత్తం 8 ఫ్రాంచైజీలు ఇప్పటికే యూఏఈకి చేరుకుని ముమ్మరంగా సాధన చేస్తున్నాయి. అంతేకాకుండా, ఐపీఎల్ ఏర్పాట్లను పరిశీలించేందుకు కూడా బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ కూడా దుబాయ్‌కు వెళ్లారు. అయితే, ఈ ఐపీఎల్‌లో తెలుగు అమ్మాయి యాంకరింగ్ చేయనుంది. ఆమె పేరు నేహా. బుల్లితెరపై యాంకర్‌గా రాణిస్తూ మంచి పేరు తెచ్చుకుంది. ఇపుడు ఐపీఎల్ 2020లో యాంకరింగ్ చేయనుంది. కొంతకాలంగా తెలుగులోనూ వ్యాఖ్యానం వినిపిస్తున్న ఐపీఎల్ ప్రసారకర్త స్టార్ స్పోర్ట్స్ తెలుగు బృందంలో నేహాకు కూడా చోటుదక్కింది.
ఈ విషయం తెలిసిన టాలీవుడ్ దర్శకేంద్రుడు కె. రాఘవేంద్ర రావు యాంకర్ నేహాకు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. శుక్రవారం నేహా పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. "నేహా చౌదరీ... జిమ్నాస్టిక్స్‌లో ఎన్నో మెడల్స్ సాధించావు. రాబోయే ఐపీఎల్‌తో నీ యాంకరింగ్ ద్వారా తెలుగు వారందరికీ మరింత దగ్గరవ్వాలని ఆశీర్వదిస్తున్నాను" అంటూ ట్వీట్ చేశారు.
కాగా, నేహా చౌదరి రిథమిక్ జిమ్నాస్టిక్స్ విభాగంలో జాతీయ స్థాయి చాంపియన్ కూడా. అయితే వినోద రంగంపై ఆసక్తితో ఆమె యాంకర్‌గా కెరీర్ ప్రారంభించి కొద్దికాలంలోనే మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఆమె ప్రతిభకు తగ్గట్టుగానే కాసుల వర్షం కురిపించే ఐపీఎల్ స్వాగతం పలికింది.