రాయల్ ఛాలెంజర్స్‌కు చుక్కెదురు... ఆ క్యాచ్‌ను పడిక్కల్ పట్టేసి ఉంటే..?

శనివారం, 7 నవంబరు 2020 (11:05 IST)
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ఐపీఎల్ 2020 అంతగా కలిసిరాలేదు. కప్ గెలుచుకోవాలనే కలలతో ఈ టోర్నీలోకి అడుగుపెట్టిన కోహ్లీసేన ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించడానికి ముందు వరుసగా నాలుగు మ్యాచ్‌లలో ఓడిపోగా.. ఎలిమినేటర్‌లో కూడా సన్ రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఓడిపోయి టోర్నమెంట్ నుండి వైదొలిగింది. 
 
సన్ రైజర్స్ ఎప్పటిలాగే బౌలింగ్‌లో మెరవడంతో పరుగులు సాధించడానికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఆటగాళ్ళు చాలా కష్టపడ్డారు. మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరు జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 131 పరుగులు మాత్రమే చేయగలిగింది. 
 
ఏబీ డివిలియర్స్ 56 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఆరోన్ ఫించ్ 32 పరుగులు చేశాడు. షాబాజ్ నదీమ్ ఓ వికెట్ తీశాడు. ఓపెనర్ గా వచ్చిన కోహ్లీ 6 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. పడిక్కల్ 1 పరుగుకే నిష్క్రమించగా, మొయిన్ అలీ డకౌట్ అయ్యాడు. శివమ్‌ దూబే (8), సుందర్‌ (5) కూడా చేతులు ఎత్తేసారు.
 
హైదరాబాద్ బౌలర్లలో హోల్డర్‌కు 3, నటరాజన్ కు 2 వికెట్లు లభించాయి.ఛేజింగ్ లో సన్ రైజర్స్ కు పెద్దగా కలిసిరాలేదు. గోస్వామి డకౌట్ కాగా, కెప్టెన్ వార్నర్ 17 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. మనీష్ పాండే సైతం 24 పరుగులు చేసి జంపా బౌలింగ్ లో అవుటయ్యాడు. ప్రియమ్ గార్గ్ (7) మరోసారి నిరాశపరిచాడు.
 
దీంతో 67 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది హైదరాబాద్. మ్యాచ్ కాస్త టెన్షన్ కు వచ్చినా విలియమ్సన్-హోల్డర్ మ్యాచ్ ను ముగించేశారు. కేన్ విలియమ్సన్‌ (50; 44 బంతుల్లో, 2×4, 2×6) తో పాటూ జాసన్ హోల్డర్ (24; 20 బంతుల్లో, 3×4) రాణించాడు. బెంగళూరు బౌలర్లలో మొహమ్మద్ సిరాజ్ రెండు వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచ్‌లో విజయం సాధించిన సన్‌రైజర్స్‌ ఆదివారం క్వాలిఫైయర్-2లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడనుంది.
 
మరోవైపు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఐపీఎల్ నుండి అవుట్ అవ్వడంపై విరాట్ కోహ్లీ స్పందించాడు. ముఖ్యంగా తమ జట్టు కావాల్సిన పరుగులు చేయలేకపోయిందని అన్నాడు. 131 పరుగులతో గెలవడం కష్టమని అన్నాడు. అలాగే కేన్ విలియమ్సన్ క్యాచ్‌ను దేవదత్ పడిక్కల్ పట్టేసి ఉండి ఉంటే మ్యాచ్ స్వరూపం మరోలా ఉండేదని వెల్లడించాడు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు