ఆటగాళ్ళకు కరోనా : ఐపీఎల్ 14కు శుభంకార్డు??

మంగళవారం, 4 మే 2021 (13:26 IST)
స్వదేశంలో జరుగుతున్న ఐపీఎల్ 14వ సీజన్ పోటీలు మధ్యలోనే ఆగిపోయేలా కనిపిస్తోంది. పలువురు ఆటగాళ్లకు కరోనా వైరస్ సోకింది. సోమవారం కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టులో ఇద్దరు ఆటగాళ్లకు కరోనా పాజిటివ్ వచ్చింది. 
 
ఈ నేపథ్యంలో అన్ని జట్లు తమ ఆటగాళ్లకు కరోనా పరీక్షలు నిర్వహిస్తుండగా, సన్ రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు వృద్ధిమాన్ సాహాకు కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది. దాంతో, మంగళవారం సన్ రైజర్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ పై అనుమాన మేఘాలు అలముకున్నాయి.
 
అటు, చెన్నై సూపర్ కింగ్స్ జట్టులోనూ కరోనా కలకలం రేగింది. ఈ జట్టులోని ఇద్దరు ఆటగాళ్లతో పాటు.. బస్సు క్లీనర్‌కు ఈ వైరస్ సోకినట్టు వార్తలు రాగా, వాటిని సీఎస్కే జట్టు యాజమాన్యం కొట్టేసింది. 
 
ఈ నేపథ్యంలో ఐపీఎల్ 14 సీజన్ లీగ్ కొనసాగడంపై అనిశ్చితి నెలకొంది. సోమవారం కేకేఆర్ ఆటగాళ్లకు పాజిటివ్ రాగానే, సాయంత్రం జరగాల్సిన మ్యాచ్‌ను వాయిదా వేశారు. ఇప్పుడు వరుసగా కేసులు వస్తుండడంతో ఐపీఎల్‌ను నిలిపివేసే అవకాశాలున్నాయి. 
 
తాజా పరిణామాలపై చర్చించేందుకు బీసీసీఐ మంగళవారం ప్రత్యేకంగా సమావేశమవుతోంది. ఐపీఎల్ కొనసాగింపుపై ఈ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. అయితే లీగ్‌ను రద్దు చేయకుండా, రీషెడ్యూల్ చేస్తారన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. 
 
దేశంలో కరోనా ఉద్ధృతి తగ్గిన తర్వాత ఐపీఎల్ 14వ సీజన్‌ను కొనసాగించాలన్నది బోర్డు ఆలోచనగా తెలుస్తోంది. నిజానికి దేశంలో కరోనా మరణ మృదంగం కొనసాగుతున్న వేళ ఐపీఎల్ పోటీల నిర్వహణపై అనేక విమర్శలు వచ్చినా బీసీసీఐ ఏమాత్రం వెనక్కితగ్గని విషయం తెల్సిందే. 
 
తాజా సమాచారం ప్రకారం... ఢిల్లీ లెగ్ స్పిన్నర్ అమిత్ మిశ్రా కూడా కరోనా బారినపడ్డట్టు తెలుస్తోంది. మిశ్రాకు కరోనా పాజిటివ్ వచ్చినట్టు జాతీయ మీడియా పేర్కొంది. ఈ పరిస్థితుల్లో లీగ్ కొనసాగించడం కష్టమే!

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు