చార్మినార్‌ పరిసరాలు కళకళ

రంజాన్‌ పండుగకు అవసరమైన సామగ్రిని కొనుగోలు చేసేందుకు వచ్చిన ముస్లింలతో చార్మినార్‌ పరిసరాల్లోని మార్కెట్లు కళకళలాడాయి. బుధవారం అక్టోబర్‌ నెల ప్రారంభం కావడంతో వేతనాలు అందుకున్న ఉద్యోగులు తమ కుటుంబ సభ్యులతో కలిసి షాపింగ్‌ చేయడంతో ఇక్కడి దుకాణాల్లో సందడి నెలకొంది.

నెల రోజుల పాటు కఠోర ఉపవాసదీక్షలు నిర్వహించిన ముస్లిం కుటుంబాలు రంజాన్‌ నుంచి కొత్త వస్తువులను వినియోగించడం సంప్రదాయం. అంతేకాకుండా పండుగ రోజు తప్పనిసరిగా కొత్త వస్త్రాలు ధరించాలనే నియమాన్ని పాటిస్తున్నారు. దీంతో పేద, ధనిక అనే భేదం లేకుండా ముస్లింలందరూ దుకాణాలకు చేరి కొనుగోళ్లు జరిపారు.

పరిమళాన్ని విరజిమ్ముతున్న అత్తర్లు...
ఈదుల్‌ఫితర్‌ ప్రార్ధనలకు వెళ్లే ముందుగా కొత్తదుస్తులు ధరించి సువాసనలు వెదజల్లే అత్తర్లు చల్లుకోవడం పరిపాటి. దీంతో అత్తర్లు విక్రయించే గుల్జార్‌హౌజ్‌, మదీనా, అఫ్జల్‌గంజ్‌, నాంపల్లి, మెహిదీపట్నం, ఆసిఫ్‌నగర్‌ మార్కెట్లు సందడిగా కనిపించాయి. ముస్లింలు వారి ఆర్థిక స్తోమతను బట్టి పదిరూపాయల నుంచి సుమారు 10 వేల వరకు విలువైన అత్తరు బాటిళ్లు కొనుగోలు చేశారు. జాస్మిన్‌, రోజ్‌, మోగ్రా, సందల్‌ సెంట్‌లను ఎక్కువగా కొనుగోలు చేశారు.

వెబ్దునియా పై చదవండి