రంజాన్ మాసం: ప్రత్యేక ప్రార్థనలకు ముస్తాబైన మసీదులు!

శుక్రవారం, 20 జులై 2012 (16:23 IST)
FILE
ముస్లింలకు అతిపవిత్రమైన రంజాన్ మాసం ఉపవాసాలు శనివారం నుంచి ప్రారంభం కానున్నాయి. శనివారం నెలవంక దర్శనంతో రంజాన్ నెల ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా రాష్ట్రంలోని వివిధ మసీదుల్లో ముస్లింలు ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొననున్నారు.

ముస్లింలు అతిపవిత్రంగా భావించే ఈ నెలలో వారు అనేక దైవకార్యాలు చేస్తారు. ప్రతిరోజూ ఐదు సార్లు ప్రత్యేక ప్రార్థనలు జరుపుతారు. ఈ నెలలోనే అల్లా దైవదూత ద్వారా ఖురాన్‌ను ఆకాశం నుంచి పంపించారని ముస్లింల నమ్మకం. ఈ విశ్వాసంతో వీరు ముప్ఫై ఖురాన్ పారాలను పఠిస్తారు.

30 రోజులు ఉపవాసాలు ఉండి దేవున్ని ప్రార్ధిస్తే వారుచేసే తప్పులు కొంతవరకైనా దేవుడు క్షమిస్తాడని వారి నమ్మకం. రంజాన్ నెలలో చిన్నా, పెద్దా తేడా లేకుండా ఈ 30 రోజులు ఉపవాసాలు ఉండి భగవంతుడిని ప్రార్ధిస్తారు. ఉదయం 4.30 నిమిషాల నుండి సాయంత్రం 6.15 నిమిషాల వరకూ ఉపవాస దీక్ష కొనసాగిస్తారు.

ఈ దీక్షా సమయంలో పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టరు. అంతేకాక అబద్దాలు ఆడటం, చెడుకార్యక్రమాలకు దూరంగా ఉంటారు. అంతేగాకుండా ఏడాది మొత్తం సంపాదించిన ధనంలో పేదవారికి దానం చేస్తారు. పేద ముస్లింలకు దుస్తులు, నగదు పంపిణీ చేస్తారు.

వెబ్దునియా పై చదవండి