ప్రస్తుతం దేశంలోని దాదాపు అన్ని బ్యాంకులు, టెలికాం సంస్థలు ఆధార్ డేటాను తీసుకున్న తర్వాతే సేవలందిస్తున్నాయి. కస్టమర్లకు ఇష్టమైతే స్వచ్ఛందంగా డేటా ఇవ్వొచ్చంటూ కేంద్రం జులైలో ఆధార్ చట్టానికి సవరణ చేయడంతో ప్రైవేటు సంస్థలు ఆధార్ డేటాను వాడుకుంటున్నాయి.
అయితే, జులైలో కేంద్రం చేసిన సవరణ.. 2019 మార్చి నాటి సుప్రీంకోర్టు రాజ్యాంగ బెంచ్ తీర్పును నీరుగార్చేలా ఉందని, ప్రైవేటుకు ఆధార్ అనుమతి రాజ్యాంగవిరుద్ధమంటూ ఎస్జీ వొంబాట్కేర్ అనే రిటైర్డ్ ఆర్మీ అధికారి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. దీన్ని సీజేఐ జస్టిస్ ఎస్ఏ బోబ్డే, జస్టిస్ బీఆర్ గవై బెంచ్ పరిశీలించింది. ఈ అంశంపై వివరణ ఇవ్వాల్సిందిగా బెంచ్ కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
ఆధార్ చట్టం ప్రమాణికతను సమర్థిస్తూ మార్చిలో తీర్పు చెప్పిన సుప్రీం బెంచ్.. ఈ చట్టానికి ఎలాంటి మినహాయింపులు ఉండవని, స్వచ్ఛందంగానైనాసరే కస్టమర్ల నుంచి ప్రైవేటు కంపెనీలు ఆధార్ డేటా సేకరించడానికి వీల్లేదని స్పష్టం చేసింది.