రిలయన్స్ జియో ఉచిత సేవలు ఈనెలాఖరు తర్వాత ముగిసిపోయే ప్రమాదం ఉంది. ఎందుకంటే.. జియో టెలికాం ప్రత్యర్థి ఎయిర్‌టెల్ ఏకంగా.. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ (ట్రాయ్)పైనే టెలికామ్ డిస్ప్యూట్స్ సెటిల్‌మెంట్ అండ్ అప్పీలెట్ ట్రిబ్యూనల్(టీడీశాట్)కు ఫిర్యాదు చేసింది. దీంతో తమ విచారణకు హాజరుకావాలంటూ రిలయన్స్ జియోకు టీడీశాట్ ఆదేశాలు జారీ చేసింది. ఒకవేళ ఈ విచారణలో రిలయన్స్ జియో ప్రకటించిన న్యూ ఇయర్ ఆఫర్ చెల్లదని ప్రకటిస్తే డిసెంబర్ 31వ తేదీ తర్వాత ఉచిత సేవలన్నీ బంద్ కానున్నాయి. ఈ వివరాలను పరిశీలిస్తే...
దేశ టెలికాం రంగంలోకి సేవలు అందించేందుకు వచ్చిన రిలయన్స్ జియో.. మూడు నెలల పాటు ఉచిత వాయిస్, డేటాను వినియోగదారులకు ప్రకటించింది. ప్రస్తుతం జియో కస్టమర్లంతా ఈ ఉచిత సేవలను పొందుతున్నారు. వాస్తవానికి ఈ వెల్‌కమ్ ఆఫర్ డిసెంబర్ 3వ తేదీతో ముగిసింది. ఆ తర్వాత జియో ప్రమోషనల్ ఆఫర్‌ను న్యూ ఇయర్ ఆఫర్‌గా మార్చింది. ఈ సేవలు 2017 మార్చి నెలాఖరు వరకు పొడిగిస్తున్నట్టు జియో ప్రకటించగా, దీనికి ట్రాయ్ కూడా ఆమోదం తెలిపింది.
దీనిపై ఎయిర్‌టెల్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడమే కాకుండా ఏకంగా టీడీశాట్‌కు ట్రాయ్‌పై ఫిర్యాదు చేసింది. జియో విషయంలో ట్రాయ్ మెతక వైఖరి అవలంభిస్తోందని, ప్రేక్షక పాత్ర పోషిస్తోందని ఎయిర్‌టెల్ తన ఫిర్యాదులో పేర్కొంది. ఈ పిటిషన్‌పై విచారించిన టీడీశాట్ జియో కౌన్సెల్‌ను హాజరుకావాలని ఆదేశించింది. ట్రాయ్ జియోకిచ్చిన అనుమతిపై పునరాలోచించి నిర్ణయం తీసుకోవాలని, జియోను ప్రతివాదిగా చేర్చాలని ట్రాయ్‌కి ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసుపై విచారణను జనవరి 6, 2017కు టీడీశాట్ వాయిదా వేసింది.