అమేజాన్ కలవనున్న ఎయిర్‌టెల్.. మైక్రోసాఫ్ట్‌తో జియో చర్చలు?

గురువారం, 4 జూన్ 2020 (19:39 IST)
టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్ టెల్ కంపెనీతో ప్రపంచ ఈ-కామర్స్ సంస్థ అమేజాన్ జోడీ కట్టనుంది. ఇందులో భాగంగా భారతీ ఎయిర్‌టెల్ సంస్థ అమేజాన్ కు రూ. 15 వేల కోట్ల వాటాను విక్రయించనున్నట్లు సమాచారం.

ప్రస్తుతం భారతి ఎయిర్‌టెల్‌ దేశంలో రూ.30 కోట్ల వినియోగదారులతో మూడో అతిపెద్ద టెలికాం సంస్థగా కొనసాగుతోంది. ఈ ఒప్పందాలకు సంబంధించిన వివరాలను గోప్యంగా ఉంచినట్లు తెలుస్తోంది. 
 
కానీ ఈ వార్తలను ఊహాగానాలంటూ కొందరు సంస్థ ప్రతినిధులు కొట్టిపారేశారు. ఇంకా భవిష్యత్తులో జరిగే ఒప్పందాలపై తామిప్పుడే స్పందించలేమని తెలిపారు.

అయితే మొబైల్‌ రంగంలో రిలయన్స్‌, ఎయిర్‌టెల్‌ తీవ్ర పోటీని ఎదుర్కొంటున్న నేపథ్యంలో అమేజాన్‌తో కలవడం వల్ల సంస్థ వృద్ధి మరింత పెరిగే అవకాశం ఉందని ఐటీ నిపుణులు విశ్లేషిస్తున్నారు.
 
భారతదేశంలో రెండవ అతిపెద్ద టెలికం ఆపరేటర్ వోడాఫోన్ ఐడియాలో వాటాను కొనుగోలు చేయడానికి గూగుల్ ప్రత్యేక చర్చలు జరుపుతున్నందున భారతి ఎయిర్‌టెల్‌పై అమేజాన్ ఆసక్తి కనబరిచిందని సమాచారం. ఇప్పటికే ఫేస్‌బుక్ రిలయన్స్ జియో నుంచి 9.99శాతం వాటాను కొనుగోలు చేసింది.

స్థానిక మీడియా నివేదికల ప్రకారం, మైక్రోసాఫ్ట్ రిలయన్స్ జియో ప్లాట్‌ఫామ్‌లతో కూడా చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఇదే సక్సెస్ అయితే 2 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టవచ్చునని వార్తలు వస్తున్నాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు