పేలిన శామ్‌సంగ్ ఫోన్స్.. యాపిల్ విక్రయాల జోరు.. ఫ్లిప్ కార్టే కారణం?

మంగళవారం, 8 నవంబరు 2016 (16:22 IST)
ఈ-కామర్స్ వెబ్‌సైట్ ఫ్లిప్ కార్టుతో ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ యాపిల్‌తో జతకట్టింది. పండుగ వేళలో యాపిల్ సంస్థ మార్కెట్‌లోకి విడుదల చేసిన ఐఫోన్‌7, ఐఫోన్‌ 7 ప్లస్‌ విక్రయాలు అక్టోబరు నెలలో 50 శాతం మేరకు పెరిగాయి. యాపిల్‌ సంస్థకు చిన్న చిన్న పట్టణాల్లో విక్రయ కేంద్రాలు లేవు. ఫ్లిప్‌కార్ట్‌తో జతకట్టడం ద్వారా ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసిన వారికి పంపిణీ చేయడంలో ఇబ్బంది లేకపోవడంతో అమ్మకాలు మెరుగైనట్లు ప్రముఖ టెక్నాలజీ పరిశోధన సంస్థ సైబర్‌మీడియా పేర్కొంది. 
 
గడిచిన తొమ్మిదినెలల కాలంలో రూ.20వేలకు మించి విలువ చేసే ఫోన్ల విపణిలో ఐఫోన్‌7 వాటా 20శాతం ఉందని, అక్టోబరులో ఇది గరిష్ఠస్థాయికి వెళ్లినట్లు విశ్లేషకుడు ఫైసల్‌ కావూసా వెల్లడించారు. సామ్‌సంగ్‌కు చెందిన గెలాక్సీ నోట్‌7లో బ్యాటరీ సమస్యలు తలెత్తడంతో ఐఫోన్‌ విక్రయాలు పెరిగినట్లు చెప్పారు. భవిష్యత్తులో యాపిల్ ఐఫోన్ల విక్రయాలు పెరిగే అవకాశం ఉందని కావూసా తెలిపారు. 

వెబ్దునియా పై చదవండి