ఆధార్ తప్పనిసరి చేస్తూ ఇచ్చిన గడువును 2018, మార్చి 31వ వరకు పొడిగించినట్లు కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. 2017, డిసెంబర్ 31 వరకు ఉన్న ఈ గడువును మరో మూడు నెలలు పెంచినట్లు కేంద్రం వెల్లడించింది. ప్రభుత్వ సేవలు, పథకాలు పొందడానికి ఆధార్ తప్పనిసరి అంటూ కేంద్రం ప్రకటించిన నేపథ్యంలో.. ప్రజల సౌకర్యార్థం ఆ గడువును మార్చి 31వ తేదీ వరకు ప్రకటించింది.
ఈ నేపథ్యంలో బ్యాంకు ఖాతాలకు, ఫోన్ నెంబర్లకు ఆధార్‌ను తప్పనిసరి చేస్తున్న కేంద్రంలోని ప్రధాని నరేంద్ర మోదీ సర్కారు.. ఈ విధానాన్ని సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌కు కూడా అంటగట్టనున్నట్లు తెలుస్తోంది. ఇందుకు ఫేస్ బుక్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చే రీతిలో సిద్ధంగా వుంది. త్వరలో ఫేస్‌బుక్ ఖాతా సృష్టించుకోవాలంటే ఆధార్‌లో ఉన్న పేరును ఉపయోగించేలా ఆ సంస్థ చర్యలు తీసుకోబోతోంది.
తప్పుడు పేర్లతో అకౌంట్లు తెరిచి, మోసాలకు పాల్పడుతున్న వారిని నియంత్రించేందుకే ఈ పద్ధతిని ఫేస్‌బుక్ కూడా అమలు చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. కానీ ఈ విధానాన్ని ఆప్షనల్‌గా ఉంచాలని.. ఆధార్ కార్డులోని పేరును మాత్రమే ఎఫ్‌బీ ఖాతా తెరిచేందుకు ఉపయోగించేలా వుంటుందని తెలుస్తోంది.