దేశంలో ఐదో తరం టెలికాం తరంగాల (5జీ) విక్రయం కోసం మంగళవారం నుంచి వేలం పాటలు సాగుతున్నాయి. తొలి రోజున ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ వేలం పాటలు సాగాయి. ఈ వేలం పాటల్లో 5జీ స్పెక్ట్రమ్ కోసం భలే డిమాండ్ ఏర్పడింది. ఫలితంగా తొలి రోజు వేలం పాటల్లో బిడ్డింగ్ రూ.1.45 లక్షల కోట్లు దాటిపోయింది. రెండో రోజైన బుధవారం కూడా 72 గిగాహెర్ట్జ్ స్పెక్ట్రమ్ కోసం వేలం పాటను నిర్వహించనున్నారు.
తొలిరోజు జరిగిన వేలం పాటల్లో జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా, ఆదానీ గ్రూపుతో పాటు పలు సంస్థలు బిడ్డింగ్‌లో పాల్గొన్నాయి. మొదటి రోజు వేలం పాటల్లో మొత్తం నాలుగు రౌండ్ల నిర్వహించామని, మొత్తం బిడ్డింగ్ రూ.1.45 లక్షల కోట్లు దాటిందని కేంద్ర టెలికాం మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. బుధవారం ఐదో రౌండ్ పాటలను నిర్వహిస్తామని ఆయన తెలిపారు.
ఈ వేలం పాటల తర్వాత స్పెక్ట్రమ్ కేటాయింపులు జరుపుతామని, ఈ ప్రక్రియ ఆగస్టు 15వతేదీ నాటికి పూర్తి చేస్తామని తెలిపారు. ఆ తర్వాత ఈ యేడాది ఆఖరు నాటికి దేశంలోని పలు ప్రధాన నగరాల్లో 5జీ సేవలు ప్రారంభమవుతాయని మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. తొలి రోజు జరిగిన వేలం పాటల్లో 3300 మెగార్ట్జ్, 26 గిగాహెర్ట్ట్ బాండ్స్ కోసం టెలికాం కంపెనీలు తీవ్రంగా పోటీపడ్డాయని ఆయన తెలిపారు.