ఒక చిన్న మాటను పై స్థానాల్లో ఉన్న వారు తూలితే ఒక కీలక రంగం ఎన్ని ఒడిదుడుకులకు లోనవుతుందో, 24 గంటల్లో ఎంత మార్పు వస్తుందో చూడాలంటే ఐటీ ఉత్థాన పతనాల చరిత్రే సాక్ష్యం. మంగళవారం స్టాక్ మార్కెట్లో భారీగా పుంజుకున్న ఐటీ దిగ్గజ సంస్థల షేర్లు ఒక్క రోజులోపే భారీ పతనాన్ని చవిచూశాయి. దీనికి కారణం ఇన్ఫోసిస్ సీఓఓ చేసిన ప్రకటన. అంతర్జాతీయంగా తాము సేవలందిస్తున్న ఖాతాదారులు ఇకపై తమ ఐటీ రంగ వ్యయాలను తగ్గించుకోనున్నారన్న ఒక్క మాట ఆయన నోటినుంచి వెలువడిందో లేదో ఐటీ షేర్లు కుప్పగూలిపోయాయి.
దీంతో ఇన్వెస్టర్లలో భయాందోళనలు నెలకొన్నాయి. దీంతో దాదాపు అన్ని ఐటీ షేర్లలో భారీ సెల్లింగ్ ప్రెజర్ కనిపించింది. ఐటీ మేజర్లు ఇన్ఫీ, టీసీఎస్, విప్రో, హెచ్‌సీఎల్ సహా ఇతర టెక్ షేర్లు భారీగా నష్టపోయాయి. అయితే అలాంటిదేమీ లేదని ఇన్ఫీ యాజమాన్యం వివరణ ఇచ్చినా ఫలితం లేకపోయింది. మిడ్‌సెషన్ తరువాత ప్రధానంగా ఆర్‌బీఐ పాలసీ ప్రకటన అనంతరం కొద్దిగా కోలుకున్నప్పటికీ నష్టాల్లోనే ముగిశాయి.
అంతా జరిగిపోయాక ఇన్ఫోసిస్ సీవోవో ఫక్తు రాజకీయ నేతలాగే వ్యవహరించారు. తమ సంస్థ ఖాతాదారుల నుంచి తమకు వచ్చే ఆదాయం తగ్గలేదని తాను అనలేదని, తన మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారని యుబి ప్రవీణ్ రావు వివరించారు.