అదిరిపోయే ఆఫర్లతో ముందుకొచ్చిన రిలయన్స్ జియో

మంగళవారం, 1 సెప్టెంబరు 2020 (10:26 IST)
రిలయన్స్ జియో అదిరిపోయే ఆఫర్‌తో తాజాగా ముందుకు వచ్చింది. డేటా వినియోగంపై ఎలాంటి పరిమితులు (అన్‌‌లిమిటెడ్‌) లేకుండా జియో ఫైబర్‌ ఇందుకోసం మూడు కొత్త పథకాలు ప్రకటించింది. ఈ ప్లాన్‌లు సోమవారం నుంచే అమల్లోకి వచ్చాయి. 
 
నెలకు రూ.399 కనీస చందాతో ప్రారంభించిన పథకం అందర్నీ ఆకర్షిస్తోంది. ప్లాన్‌ కింద 30 ఎంబీపీఎస్‌ స్పీడ్‌తో డేటా అప్‌లోడ్‌ లేదా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. దీంతోపాటు రూ.999, రూ.1,499 నెలవారీ సబ్‌స్క్రిప్షన్‌తో మరో రెండు కొత్త పథకాలు ప్రకటించింది. ఈ రెండు ప్లాన్స్‌లో 11 నుంచి 12 ఓటీటీ యాప్స్‌ సబ్‌స్ర్కిప్షన్‌ ఉచితంగా లభిస్తుంది. 
 
అంతేకాకుండా, నెల రోజుల ఉచిత ట్రయల్ సదుపాయాన్ని కల్పించింది. ఖాతాదారులు నెల రోజుల పాటు ఉచితంగా ఈ మూడు ప్లాన్స్‌ ట్రై చేయవచ్చు. నెల రోజులు గడిచిన తర్వాత ఇష్టమైతే సబ్‌స్క్రైబ్‌ చేసుకోవచ్చు. కేవలం ఇంటర్నెట్‌ సేవలు మాత్రమే చాలనుకుంటే రూ.1,500 రిఫండబుల్‌ డిపాజిట్‌ చెల్లించాలి. ఇంటర్నెట్‌తో పాటు ఉచిత ఓటీటీ యాప్స్‌ కావాలంటే రూ.2,500 రిఫండబుల్‌ డిపాజిట్‌ చెల్లించాలి. ఆఫర్‌ కింద కంపెనీ ఉచితంగా 4కే సెట్‌టాప్‌ బాక్స్‌, వైఫై రూటర్‌ను అందిస్తుంది. 
 
'ఇంటింటికీ ఇంటర్నెట్ తీసుకెళ్లడం ద్వారా కుటుంబంలోని అందరికీ సాధికారత చేకూర్చాలని మేము ఆశిస్తున్నాం. జియో ద్వారా మన దేశాన్ని ప్రపంచంలోనే వేగంగా ఎదుగుతున్న అతిపెద్ద మొబైల్ మార్కెట్‌గా తీర్చిదిద్దాం. ఇప్పుడు జియో ఫైబర్ ద్వారా గ్లోబల్ బ్రాడ్‌బాండ్‌ నాయకత్వంలో భారత్‌ను అగ్రస్థానంలో నిలబెట్టడమే లక్ష్యంగా పెట్టుకున్నాం. అందుకే ఇప్పుడు మొత్తం 1600 నగరాలు, పట్టణాల్లో బ్రాడ్‌బాండ్ సేవలు ప్రారంభిస్తున్నాం' అని రిలయన్స్ జియో ఓ ప్రకటనలో పేర్కొంది. 
 
కాగా తాజాగా 150 ఎంబీపీఎస్ ప్లాన్లను ఎంచుకునేందుకు 10కిపైగా ఉచిత యాప్‌లతో 30 రోజుల పాటు ఫ్రీ ట్రయల్‌ కూడా అందించనున్నట్టు జియో ప్రకటించింది. రూ.999 పైబడిన అన్ని కొత్త ప్లాన్లలోనూ అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ హాట్ స్టార్, జీ5, సోనీ లైవ్ సహా 11 యాప్‌లకు ఉచిత సబ్‌స్క్రిప్షన్ లభిస్తుంది. రూ.1,499 ప్లాన్‌లో వీటికి అదనంగా నెట్‌ఫ్లిక్స్ సైతం అందుబాటులోకి వస్తుంది. ఇప్పటికే వివిధ ప్లాన్‌ల కింద ఉన్న జియో‌ఫైబర్ వినియోగదారులను కొత్త టారిఫ్ ప్లాన్లకు అప్‌గ్రేడ్ చేస్తామని ఆ కంపెనీ తెలిపింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు