జియో నుంచి లైవ్ వీడియో కాల్ ఫీచర్.. '102 నాటౌట్' కామెడీ షోని?

శుక్రవారం, 4 మే 2018 (15:59 IST)
ఉచిత డేటా పేరిట దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన జియో ప్రస్తుతం ప్రపంచంలోనే తొలి ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారిత జియో ఇంటరాక్ట్ వేదికను ప్రారంభించింది. జియో ఇంటరాక్ట్‌లో భాగంగా తొలుత లైవ్ వీడియో కాల్ ఫీచర్‌ను ప్రారంభిస్తున్నట్లు జియో ప్రకటన చేసింది. దీనికి కస్టమర్లు చేయాల్సిందల్లా మై జియో అప్లికేషన్‌‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. 
 
యాప్ డౌన్‌లోడ్ అయిన తర్వాత జియో ఇంటరాక్ట్‌పై క్లిక్ చేసి స్టార్ వీడియో కాల్‌పై ట్యాప్ చేస్తే సరిపోతుంది. బిగ్ బీ అమితాబ్ బచ్చన్ త్వరలో ప్రారంభించబోయే ''102 నాటౌట్'' కామెడీ షోని ఈ లైవ్ వీడియో కాల్ ఫీచర్ ద్వారా అందించనున్నట్లు జియో వెల్లడించింది. 
 
ఇప్పటికే 186 మిలియన్ల సబ్‌స్క్రైబర్లు, 150 మిలియన్ల స్మార్ట్ ఫోన్ వినియోగదారులతో టెలికాం రంగంలో అగ్రస్థానానికి చేరుకున్న జియో.. తాజా సేవలతో కస్టమర్ల సంఖ్యను పెంచుకునే వీలుంటుంది. త్వరలో వీడియో కాల్ సెంటర్లు, వీడియో కేటలాగ్, వర్చువల్ షో రూమ్‌లు ప్రవేశ పెట్టనున్నట్టు జియో తెలిపింది. జియో ఇంటరాక్ట్‌లో తొలి లైవ్ వీడియో కాలింగ్ అమితాబ్ బచ్చన్‌తోనే ప్రారంభం కానుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు