లెనోవా మరో సరికొత్త ఉత్పత్తితో భారత మార్కెట్‌లోకి రానుంది. లెనోవా యోగా ప్రో 7ఐ పేరుతో కొత్త ల్యాప్‌టాప్‌ను విడుదల చేసింది. మల్టీటాస్కింగ్ కంటెంట్ క్రియేటర్లను దృష్టిలో ఉంచుకొని దీన్ని రూపొందించింది. ప్రపంచవ్యాప్తంగా మార్చిలోనే విడుదలైన ఈ ల్యాప్‌టాప్ తాజాగా భారత కస్టమర్లకు అందుబాటులోకి వచ్చింది. అయితే, దీని ధరన కాస్తంత అధికంగానే ఉంది. ప్రస్తుతం ప్రారంభ ధరగా రూ.1.5 లక్షలుగా నిర్ణయించింది. ఇంటెల్ కోర్ అల్ట్రా 7 ప్రాసెసర్, ఎన్విడియా జీఈఫోర్స్ ఆర్‌టీఎక్స్ 4050 జీపీయూతో అద్భుతమైన గేమింగ్ అనుభూతిని అందిస్తుందని కంపెనీ తెలిపింది.
యోగా ప్రో 7ఐలో 120Hz రీఫ్రెష్ రేటు, డాల్బీ విజన్ కంటెంట్ సపోర్ట్, ఓలెడ్ స్క్రీన్‌తో కూడిన 14 అంగుళాల తెరను పొందుపర్చారు. హెచ్‌డీఆర్ కలర్ ప్రొడక్షన్ కోసం వెసా డిస్‌ప్లేహెచ్‌డీఆర్ ట్రూ బ్లాక్ 500 సర్టిఫికేషన్ కూడా ఉంది. అల్యూమినియం ఛాసిస్, బ్యాక్‌లిట్ కీబోర్డుతో ల్యాప్‌టాప్‌కు ప్రీమియం లుక్ వచ్చింది. కృత్రిమ మేధ ఫీచర్ల కోసం ప్రత్యేకంగా కోపైలట్ కీని పొందుపర్చడం దీని ప్రత్యేకత.
యోగా ప్రో 7ఐ ల్యాప్‌టాప్‌లో 16జీబీ డ్యూయల్ ఛానెల్ ర్యామ్, 1టీబీ వరకు స్టోరేజ్ ఉంది. విండోస్ 11 హోమ్‌తో పనిచేస్తుంది. మైక్రోసాఫ్ట్ ఆఫీస్ హోమ్, స్టూడెంట్ 2021 ఎడిషన్ కూడా ఉంది. మల్టీమీడియా అనుభూతి కోసం డాల్బీ అట్మోస్ సపోర్ట్‌తో కూడిన క్వాడ్ స్పీకర్, హెచ్‌డీ ఆడియో చిప్‌ను ఇచ్చారు. దీంట్లో క్వాడ్ మైక్, డెప్త్ సెన్సర్‌తో కూడిన ఫుల్ హెచ్‌డీ ఐఆర్ కెమెరా ఉన్నాయి. సురక్షితమైన యూజర్ అథెంటికేషన్ కోసం విండోస్ హలో సపోర్ట్ కూడా ఉంది. బ్లూటూత్ 5.3, వైఫై 6ఈతో పాటు పలు పోర్టులతో పలు కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి.