రిలయన్స్ జియో మరో సంచలనం.. ఉచిత సేవలన్నీ ఇక 3జీ కస్టమర్లకు కూడా.. జనవరి 1 నుంచి?

గురువారం, 22 డిశెంబరు 2016 (17:24 IST)
రిలయన్స్ జియో మరో సంచలనానికి తెరతీసే పనిలో ఉంది. 4జి సిమ్ ఉపయోగిస్తున్నవారికి అందుతున్న ఉచిత సేవలన్నీ 3జివారికి కూడా అందించడం ద్వారా మరింత పెద్ద సంఖ్యలో వినియోగదారులను ఆకర్షించాలనే లక్ష్యంతో రిలయన్స్ జియో ముందుకెళ్తోంది. ఇప్పటికే ఐదుకోట్ల మందికి మించి రిలయన్స్ జియో కస్టమర్లున్నారు. ఈ నెలాఖరులో విడుదల చేయబోయే యాప్ ద్వారా హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్‌ను కూడా కస్టమర్లకు అందిస్తారని తెలుస్తోంది. 
 
ఆ యాప్ ద్వారా 4జీతో అందిస్తున్న ఉచిత ఇంటర్నెట్, టాక్‌టైం ఆఫర్‌ను 3జి సిమ్ కార్డులు ఉపయోగిస్తున్నవారికి కూడా అందుబాటులోకి తెచ్చే అవకాశాలున్నాయి. ఇందుకోసం ఇప్పటికే ప్రత్యేక యాప్ సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సదుపాయాన్ని కొత్త సంవత్సరం నుంచి అందుబాటులోకి తెచ్చేందుకు జియో సర్వం సిద్ధం చేస్తోంది. జనవరి 1న 'హ్యాపీ న్యూఇయర్‌ ఆఫర్‌' కింద 3జీ కస్టమర్లకు ఈ సౌకర్యం కల్పించనున్నట్లు సమాచారం.
 
తొలుత డిసెంబర్‌ 31 వరకు 'వెల్‌కమ్‌ ఆఫర్‌' కింద ఉచిత కాల్స్‌, అపరిమిత డేటా సౌకర్యం కల్పించిన జియో.. ఆ ఆఫర్‌ను మార్చి 31 వరకు ఇటీవల పొడిగించిన విషయం తెలిసిందే. ఇప్పటికే 5.2కోట్లమంది తమ చందాదారులుగా చేరినట్లు కంపెనీ ఇది వరకే వెల్లడించింది. అయితే మరింత మందికి చేరువయ్యే ఉద్దేశంతో 3జీ కస్టమర్ల కోసం తాజాగా యాప్‌ను సిద్ధంచేస్తోంది. అయితే, రోజుకు 1జీబీ పరిమితిని విధించింది.

వెబ్దునియా పై చదవండి