నిజానికి ప్రముఖ ఎలక్ట్రానిక్స్ తయారీ కంపెనీలు ఎల్‌జీ, శాంసంగ్‌లతోపాటు మొబైల్స్ తయారీ కంపెనీ హువావేలు ఈ తరహా ఫోన్లను తయారు చేస్తున్నట్టు గత కొన్ని రోజులుగా ప్రకటిస్తూ వచ్చాయి. కానీ ఈ కంపెనీలకు ఓ చైనా కంపెనీ షాకిచ్చింది. రాయొలే కార్పొరేషన్ అనే కంపెనీ మడతబెట్టే ఫోన్‌ను తయారు చేసి మార్కెట్‌లోకి విడుదల చేసింది. ఫ్లెక్స్‌పై పేరిట ఈ ఫోన్ విడుదలైంది.
ఫ్లెక్స్‌పై ఫోన్ చూసేందుకు మినీ ట్యాబ్లెట్ పీసీలా ఉంటుంది. దీని డిస్‌ప్లే సైజ్ 7.8 అంగుళాలు. మడిచిన తర్వాత ఇది రెండు డిస్‌ప్లేలు ఉన్న ఫోన్‌లాగా కనిపిస్తుంది. ఈ ఫోన్‌లో వెనుక భాగంలో 20, 16 మెగాపిక్సల్ కెమెరాలు రెండింటిని ఏర్పాటు చేశారు. అయితే ఫోన్‌ను మడతబెడితే 20 మెగాపిక్సల్ కెమెరాను సెల్ఫీ కెమెరాగా ఉపయోగించుకోవచ్చు. కాగా ఈ ఫోన్‌ను 2 లక్షల సార్లు మడతబెట్టి పరీక్షించాకే మార్కెట్‌లోకి విడుదల చేశామని రాయొలే కంపెనీ ప్రకటించింది.
ఈ ఫోల్డబుల్ ఫోన్‌లో క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8150 ప్రాసెసర్, 6/8 జీబీ ర్యామ్, 128/256/512 జీబీ స్టోరేజ్, 3800 ఎంఏహెచ్ బ్యాటరీ తదితర ఫీచర్లు ఉన్నాయి. ఈ ఫోన్‌కు చెందిన 128 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర 1318 డాలర్లు ఉండగా, 256 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర 1469 డాలర్లుగా ఉంది. డిసెంబర్‌లో ఈ ఫోన్‌ను డెలివరీ చేయనున్నారు. ప్రస్తుతానికి ఈ ఫోన్ చైనా మార్కెట్‌లోనే విడుదలైంది.