సోనీ ఇండియా కంపెనీ తన ఫోన్ ఉత్పత్తులైన స్మార్ట్‌ఫోన్లపై ధరలను ఏకంగా 10 నుంచి 14 శాతం మేరకు తగ్గించింది. ఈ తగ్గించిన ధరలు ఈనెల ఒకటో తేదీ నుంచి అమల్లోకి వచ్చాయి. సోనీ కంపెనీ తయారు చేస్తున్న స్మార్ట్ ఫోన్లలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఎక్స్‌పీరియా ఎక్స్, జెడ్ 5లు ఉన్నాయి.
సోనీ ఎక్స్‌పిరియా ఎక్స్ ధర ఆరంభంలో రూ.48,990 ఉండగా, ఇప్పుడు రూ.10 వేలు తగ్గి రూ.38,990కి చేరుకుంది. అలాగే, ఎక్స్‌పిరియా జెడ్5 ప్రీమియం ధర రూ.55,990 కాగా, దీని ధరలో 14 శాతం కోతపెట్టింది. దీంతో ఎనిమిది వేలు తగ్గి రూ.47,990కే ఇది లభిస్తోంది. భారత్‌లో ప్రీమియం కేటగిరి స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో సోనీ కంపెనీ సత్తా చాటుతోంది.
మరోవైపు... స్మార్ట్‌ఫోన్ మార్కెట్ భారత్‌లో అత్యంత శరవేగంగా వృద్ధి చెందుతోంది. ప్రస్తుతం భారత్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో 25.1శాతం వాటాతో శామ్‌సంగ్‌ది ప్రథమ స్థానంలో ఉండగా, ఆ తర్వాతి స్థానాల్లో మైక్రోమాక్స్ (12.9శాతం), లెనోవో గ్రూప్ (7.7శాతం), ఇంటెక్స్ (7.1శాతం) ఉన్నాయి.