జియో ఉచిత సేవలకు ఫుల్‌స్టాప్ తప్పదా? ఫ్రీ ఆఫర్ ఎలా పొడగిస్తారు... జియోను వివరణ కోరిన ట్రాయ్‌

మంగళవారం, 27 డిశెంబరు 2016 (15:05 IST)
టెలికాం రంగంలో ఏ ప్రమోషనల్‌ ఆఫర్‌ అయినా 90 రోజులకు మించకూడదన్న నిబంధనకు ఉచిత వాయిస్‌, డేటా ఆఫర్‌ గడువు పొడిగింపు విరుద్ధం కాదా? అని రిలయన్స్‌ జియోను టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) ప్రశ్నించింది. దీనిపై వివరణ ఇవ్వాలని జియోను ఆదేశించింది. 
 
దేశ టెలికాం రంగంలోకి ప్రవేశించిన రిలయన్స్ జియో.. వెల్‌కమ్ ఆఫర్ కింద 3 నెలల పాటు ఉచిత ఆఫర్‌ను పొడగించింది. ఆ తర్వాత ఈ సేవలను 'న్యూ ఇయర్ ఆఫర్' కింద మరో మూడు నెలల పాటు పొడగించింది. దీనిపై ట్రాయ్‌కు జియో ప్రత్యర్థి ఎయిర్‌టెల్ ఫిర్యాదు చేసింది. దీన్ని పరిశీలించిన ట్రాయ్... వివరణ ఇవ్వాలని కోరింది. 
 
నిజానికి ఆర్‌జియో వెల్‌కమ్‌ ప్లాన్‌ గడువు డిసెంబరు మూడో తేదీతో ముగిసింది. ఆ ఆఫర్‌ను 2017 మార్చి 31వ తేదీ వరకు పొడగించింది. ఈ పొడగింపును సమూలంగా పరిశీలించిన ట్రాయ్‌ డిసెంబరు 20న రాసిన లేఖలో ఈ చర్యను పోటీ నిరోధక చర్యగా పరిగణించనక్కరలేదా? అని ప్రశ్నించింది. అంతేకాదు 2017 మార్చి 31 వరకు ప్రతి నెలా అదనంగా ఎంత మంది కస్టమర్లు జత కాగలరని భావిస్తున్నది తెలియచేయాలని కూడా ట్రాయ్‌ ఆదేశించింది. దీనిపై వివరణ ఇవ్వడానికి ఐదు రోజులు గడువు ఇచ్చింది. 

వెబ్దునియా పై చదవండి