మీరు ట్రయాంగిల్ డ్యాన్స్ గురించి విన్నారా?

గురువారం, 14 మార్చి 2019 (19:15 IST)
ట్రయాంగిల్ డ్యాన్స్.. ప్రస్తుతం సోషల్ మీడియాను ఊపేస్తున్న హాష్‌టాగ్ ఇది. ఇటీవలే ట్రాష్ చాలెంజ్ అంటూ ఓ హాష్‌టాగ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇప్పుడు ట్రయాంగిల్ డ్యాన్స్ ఛాలెంజ్ అంటూ మరొకటి వచ్చేసింది. ఈ ఛాలెంజ్ ముందుగా టిక్‌టాక్ మొబైల్ యాప్‌లో ప్రారంభమైందట. ఆ తర్వాత సోషల్ మీడియాకు కూడా వ్యాపించింది.
 
అయితే ట్రయాంగిల్ డ్యాన్స్ చేయాలంటే ముగ్గురు వ్యక్తులు ఉండాలి. ఆ ముగ్గురు వ్యక్తులు త్రిభుజాకారంలో నిలబడి ఒకరి భుజాల మీద మరొకరు చేతులు వేసి ఎగరాలి. ఇది సింపుల్‌గా ఉందని అనుకోకండి..ఆ డ్యాన్స్ వేసేటప్పుడు తెలుస్తుంది అసలు బాధేంటని. ఎందుకంటే ముగ్గురిలో ఒకరు ప్రతి స్టెప్పుకు వారి మధ్యలోకి వెళ్లాలి. తర్వాత ఇంకొకరు..అలాగా ముగ్గురూ స్టెప్స్ వేస్తూ చేసే డ్యాన్స్‌నే ట్రయాంగిల్ డ్యాన్స్ అంటారు.
 
ఇదంతా చూసిన నెటిజన్‌లు ఊరుకుంటారా? ట్రయాంగిల్ డ్యాన్స్ హాష్‌టాగ్‌తో తాము వేసిన డ్యాన్స్‌ను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఆ వీడియోకు వచ్చిన కామెంట్లు చదువుతూ తెగ మురిసిపోతున్నారు. ట్రయాంగిల్ డ్యాన్స్ ఎలా చేయాలో మీకు అర్థం కాకుంటే, వీటికి సంబంధించిన వీడియోలను నెట్‌లో చూసి ఆనందించండి..వీలైతే మీరు కూడా ట్రయాంగిల్ డ్యాన్స్ చేయడానికి ప్రయత్నించండి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు