48 గంటల్లో పాన్ కార్డు: ఆన్ లైన్ సౌకర్యం కోసం కేంద్రం కసరత్తు!

బుధవారం, 22 ఏప్రియల్ 2015 (16:29 IST)
ఇకపై 48 గంటల్లోనే పాన్ కార్డు లభించే అవకాశం ఉంది. ఇక నుంచి పాన్ కార్డు (పర్మినెంట్ అకౌంట్ నెంబర్)ను 48 గంటల్లో ఇచ్చేందుకు కేంద్రం కసరత్తు చేస్తోంది. దీనికి సంబంధించి ఆన్ లైన్ సౌకర్యం తీసుకురావాలని కూడా ఆలోచన చేస్తోంది. 
 
"దరఖాస్తుదారు నలభై ఎనిమిది గంటల్లో పాన్ కార్డు పొందేందుకు ఓ ఆన్ లైన్ సౌకర్యాన్ని తీసుకురాబోతున్నారు. దాని ద్వారా దరఖాస్తు చేసిన వ్యక్తికి ఆ సమయంలోగా కార్డు అందుతుంది" అని ప్రభుత్వ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. మరోవైపు పాన్ కార్డు పొందే విషయంలో ప్రజలకు సహాయం చేసేందుకు గ్రామీణ ప్రాంతాలు సహా దేశ వ్యాప్తంగా ప్రభుత్వం ప్రత్యేక క్యాంపులు కూడా నిర్వహించనుంది. 
 
ఇకపోతే.. పాన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న వారు ఓటర్ కార్డు, ఆధార్ కార్డ్, పుట్టిన తేదీని ధ్రువపరిచే సర్టిఫికేట్లను సమర్పించి ఆదాయపన్ను శాఖ ద్వారా పాన్ కార్డులను పొందవచ్చునని ప్రభుత్వ సీనియర్ అధికారి వెల్లడించారు.

వెబ్దునియా పై చదవండి