ఆన్‌లైన్ అగ్రగామి అయిన అమేజాన్ సంస్థ ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. అమేజాన్‌లో పనిచేసే ఉద్యోగులకు గంటలకు వెయ్యి రూపాయలను ఇవ్వనుంది. ఆన్‌లైన్ వాణిజ్యంలో అంతర్జాతీయ స్థాయిలో రెండో స్థానాన్ని సంపాదించుకున్న అమేజాన్ సంస్థకు చెందిన ప్రధాన కార్యాలయం అమెరికాలోని సియాట్టాలో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఆన్‌లైన్ వాణిజ్యంలో పురోగతి సంపాదించినా.. ఉద్యోగులకు జీతాలను పెంచడంలో ఆ సంస్థ విఫలమైందని ఆరోపణలు వెల్లువెత్తాయి.
ఇంకా ఉద్యోగులపై ఓవర్‌టైమ్, సెలవులు ఇవ్వకపోవడం ద్వారా విమర్శలు రావడం.. ఉద్యోగులు ఆందోళన చేపట్టడంతో.. అమేజాన్ సంస్థ.. గంటకు వెయ్యిరూపాయల వేతనాన్ని ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఇంతకుముందు గంటకు రూ.450లుగా వుండిన మొత్తాన్ని ఏకంగా వెయ్యి రూపాయలకి పెంచుతున్నట్లు అమేజాన్ ప్రకటించింది.
ఈ వేతన పెంపు.. అమెరికాలోని టెంపరరీ, కాంట్రాక్ట్ ఉద్యోగులకు వర్తిస్తుందని.. నవంబర్ ఒకటో తేదీ నుంచే పెరిగిన వేతనం అందిస్తామని అమేజాన్ తెలిపింది. అమేజాన్ ఈ ప్రకటనతో సదరు సంస్థకు చెందిన ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.