జుకర్ బర్గ్ ట్విట్టర్, పింటరెస్ట్ ఖాతాల హ్యాక్: భద్రత కోసమే అలా చేశామంటోన్న హ్యాకర్లు!

సోమవారం, 6 జూన్ 2016 (14:28 IST)
సోషల్ మీడియాలో ఫేస్ బుక్ అకౌంట్లు హ్యాక్ కావడం సాధారణమే. నిన్నటికి నిన్న బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ సతీమణి కిరణ్ రావ్ తన పేరిట నకిలీ ఫేస్ బుక్ అకౌంట్ ఉందని.. దాంతో తనకు ఎలాంటి సంబంధం లేదని బాంద్రా సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫేక్ అకౌంట్‌తో తన పేరు చెప్పుకుని బంధువులతో చాటింగ్ చేస్తున్నట్లు కూడా ఆమె పోలీసులకు తెలిపారు. 
 
అయితే తాజాగా ఫేస్ బుక్ సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ ట్విట్టర్, పింటరెస్ట్ ఖాతాలు హ్యాక్ అయ్యాయని వార్తలు రావడంతో.. హ్యాకర్ల పనిబట్టేందుకు సర్వం సిద్ధమవుతోంది. జుకర్‌బర్గ్ సోషల్ మీడియా ఖాతాల భద్రతను తెలుసుకునేందుకే హ్యాక్ చేసినట్లు హ్యాకర్లు తెలిపారు. హ్యాక్‌ను ఫేస్‌బుక్ అధికారులు కూడా ధ్రువీకరించారు.
 
ఇకపోతే.. మార్క్ జుకర్‌బర్గ్‌కు చెందిన ట్విట్టర్, పింటరెస్ట్ ఖాతాలను హ్యాక్ చేసినట్లు అవర్‌మైన్ టీమ్ అనే హ్యాకింగ్ గ్రూప్ ప్రకటించింది. హ్యాక్ చేసిన కొద్ది నిమిషాల తర్వాత జుకర్‌బర్గ్ ట్విట్టర్ ఖాతా నుంచి హ్యాకర్లు ఓ సందేశాన్ని ట్వీట్ కూడా చేశారు. అనంతరం పింటరెస్ట్‌లో ఆయన లింక్డిన్ పాస్‌వర్డ్‌ను సైతం పోస్టు చేశారు. ఫలితంగా జుకర్ బర్గ్ ట్విట్టర్ ఖాతాను వెంటనే తొలగించినట్లు ట్విట్టర్ పేర్కొంది.

వెబ్దునియా పై చదవండి