అమెరికాలో తలెత్తిన ఆర్థిక సంక్షోభం ఒక్కొక్క రంగంపై ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా ఐటీ రంగంపై తీవ్ర ప్రభావాన్నే చూపుతోంది. ఇప్పటికే పలు ఐటీ సంస్థలు పొదుపు చర్యలకు శ్రీకారం చుట్టి, వేలాది మందిని ఇళ్ళకు పంపించాయి. అయితే, ఐటీ రంగంపై పడిన ఆర్థిక సంక్షోభం ప్రస్తుతం వివాహాలపై కూడా పడింది.
ఐటీ రంగానికి చెందిన అబ్బాయిలు మాత్రమే వరుడుగా కావాలనుకునే పలువురు వధూవరుల తల్లిదండ్రులు మెల్లగా ఆ భావన నుంచి బయటపడుతున్నారు. ఐటీ రంగానికి చెందిన యువకులు అయితే తమ అమ్మాయిలను బాగా చూసుకుంటారనే భ్రమలో ఉండేవారు. అయితే తాజా సంక్షోభం నేపథ్యంలో దాని నుంచి బయటపడిన పలువురు యువతుల తల్లిదండ్రులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
ముఖ్యంగా ఆర్థిక ఒడిదుడులు సర్వసాధారణమని కొందరు అభిప్రాయపడుతున్నారు. మరికొందరు మాత్రం మరోలా స్పందిస్తున్నారు. ఐటీ రంగానికే చెందిన పెళ్లి కుమారుడే అవసరం లేదని, మంచి స్థాయిలో ఉండే యువకుడు చాలని అంటున్నారు. మొత్తం మీద ఆర్థిక సంక్షోభం ఐటీ వరుడుపై ఉన్న మోజును తగ్గించింది.