ఇంటర్నెట్ సెర్చ్ ఇంజన్ గూగుల్ “బెస్ట్ గ్లోబల్ బ్రాండ్స్ 2008” జాబితాలో పది స్థానాలు ఎగబాకి పదో స్థానానికి చేరుకుంది. ఇంటర్నెట్ శోధనలో పూర్తి ఆధిపత్యం చలాయించడమే కాక సాఫ్ట్వేర్, వీడియో, మ్యాపింగ్ మరియు వెబ్ బ్రౌజింగ్ వంటి రంగాల్లో విస్తరించిన గూగుల్ ఇంటర్నెట్ ప్రపంచంలో సాటిలేని రారాజుగా గుర్తింపు పొందింది.
పైగా గూగుల్ బ్రాండ్ విలువ కూడా 21.9 బిలియన్ డాలర్లనుంచి 31.5 బిలియన్ డాలర్లకు వృద్ధి చెంది 43 శాతం పెరుగుదలను సాధించిందని ఒక వెబ్సైట్ పేర్కొంది. ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ ఉన్న బ్రాండ్లపై వార్షిక అధ్యయనం ప్రకారం టెక్నాలజీ కంపెనీలు పటిష్టంగా ఉండగా ఫైనాన్షియల్ సంస్థలు బలహీన స్థానంలో ఉన్నాయని ఈ నివేదిక తెలుపుతోంది.
గూగుల్ తర్వాతి స్థానంలో ఉన్న యాపిల్ బ్రాండ్ ఇంటర్బాండ్ నిర్వహించిన 2008 ప్రపంచ ఉత్తమ బ్రాండ్లలో బాగా పుంజుకుంది. ఇది 24వ స్థానం నుంచి 9 స్థానాలకు ఎగబ్రాకింది. బెస్ట్ గ్లోబల్ బ్రాండ్స్ 2008 జాబితాలో అర్హత సాధించాలంటే ప్రతి బ్రాండ్ కూడా తన ఆదాయంలో మూడో వంతు సంపాదనను బయటి దేశాల నుంచి సాధించాల్సి ఉంది. అలాగే దాని మార్కెటింగ్ మరియు ఫైనాన్షియల్ డేటా బహిరంగంగా అందుబాటులో ఉండాలి.
ఈ జాబితాలో ప్రపంచ నెంబర్ వన్ ర్యాంకును వరుసగా 8వ సంవత్సరంలో కూడా కోకా-కోలాయే సగర్వంగా నిలబెట్టుకుంది. తన సుప్రసిద్ధ యాడ్ కేంపెయన్లు, దాని సృజనాత్మక ఆవిష్కరణలకు ముందుగా అభినందనలు చెప్పాల్సి ఉంటుంది. కాగా 2001 తర్వాత ఐబిఎమ్ సాఫ్ట్వేర్ దిగ్గజం మైక్రోసాప్ట్ను తోసిరాజని రెండవస్థానం సాధించింది.
బెస్ట్ గ్లోబల్ బ్రాండ్స్ 2008 ప్రకారం టాప్ టెన్ బ్రాండ్ల వివరాలు... 1. కోకా-కోలా 2. ఐబిఎమ్ 3. మైక్రోసాఫ్ట్ 4. జిఇ 5. నోకియా 6. టయోటా 7. ఇంటెల్ 8. మెక్డొనాల్డ్స్ 9. డిస్నీ 10. గూగుల్.