రాష్ట్రంలోని ఐటీ కంపెనీల్లో ఏర్పడ్డ అభద్రతా భావం

శనివారం, 26 డిశెంబరు 2009 (16:28 IST)
FILE
రాష్ట్రంలో ప్రత్యేక తెలంగాణ అంశం తెరపైకి రావడంతో నెలకొన్న పరిస్థితుల కారణంగా రాష్ట్ర రాజధానిలోనున్న ఐటీ కంపెనీలు, ఔట్‌ సోర్సింగ్ కంపెనీలపైన తీవ్రమైన ప్రభావం పడింది.

నగరంలోని రెండు బీపీఓ(బిజినెస్ ప్రోసెస్ అవుట్ సోర్సింగ్) కంపెనీలు భద్రతా కారణాల దృష్ట్యా తమ ఉద్యోగులను, సంస్థకు చెందిన కార్యకలాపాలను నిర్వహించుకునేందుకు దగ్గరలోని పెద్ద పెద్ద హోటళ్ళలోకి మకాం మార్చేసాయి. అలాగే మరో ఐటీ కంపెనీ కూడా ఇదే బాటలో నడిచేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది.

పలు కంపెనీలు తమ ఉద్యోగుల భద్రతను దృష్టిలో పెట్టుకుని ఈ రకంగా మార్పులు చేసుకున్నట్లు సదరు కంపెనీ యజమానులు వెల్లడించారు. అలాగే తమ క్లయింట్లతో తమ వ్యాపార లావాదేవీలు నిలవకుండా ఉండేందుకు వారికి తగిన సమయంలో సేవలందించేందుకు తాము సిద్ధంగానున్నామని తెలియజెప్పేందుకు ఇలాంటి ఏర్పాట్లు చేసుకున్నట్లు పలు కంపెనీల యజమానులు పేర్కొంటున్నారు.

ఉదాహరణకు నగరం నడిబొడ్డునవున్న సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ సర్వీసెస్ కంపెనీ ఏడీబీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ తన ఉద్యోగులను వారి ఇండ్ల నుంచి మకాం మార్చేసి స్థానికంగానున్న ఓ పెద్ద హోటల్‌లో బస, కంపెనీ వ్యవహారాలను చూసుకునేందుకు తగిన ఏర్పాట్లు చేసింది. ఇది డిసెంబరు 23న చిదంబరం దిద్దుబాటు ప్రకటన చేసిన తర్వాతే ఈ కంపెనీ తన కార్యకలాపాలను హోటల్ ద్వారా కొనసాగించేందుకు నిర్ణయం తీసుకుని తన మకాం అక్కడికి మార్చుకుని కార్యకలాపాలను కొనసాగిస్తోంది.

సదరు కంపెనీకి హైదరాబాద్, పూనా ప్రాంతాలలో దాదాపు 3,000 మంది ఉద్యోగులున్నారు. నగరంలోని కంపెనీకి చెందిన ఉద్యోగులు డిసెంబరు 23న హోటల్‌లోనే ఉన్నారు. అప్పటి నుంచి వారికి ఆ హోటలే కార్యాలయంగా మారిపోయింది. చిదంబరం రెండవసారి చేసిన ప్రకటనతో నగరం చుట్టుపక్కల పరిస్థితి దారుణంగా మారిపోయిందన్న విషయం విదితమే.

ఇదిలావుండగా ఆ సంస్థకు చెందిన ఉద్యోగులను హోటల్‌లోనే బస, కార్యాలయ కార్యకలాపాలను కొనసాగించాల్సివచ్చింది. ఎందుకంటే చిదంబరం రెండవసారి దిద్దుబాటు ప్రకటన చేసిన తర్వాత నగరంలోని పరిస్థితి చాలా దారుణంగా మారింది.

FILE
దీంతోపాటు తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) 48 గంటలపాటు బంద్కు పిలుపునివ్వడంతో పరిస్థితి ఎలావుంటుందోనని కంపెనీకి బెంగపట్టుకుంది. దీంతో కంపెనీ సదరు ఉద్యోగులను వదిలేందుకు, పికప్ చేసుకునేందుకు అవసరమైన రవాణా సౌకర్యాలు(క్యాబ్) లేకపోవడంతో వారిని హోటల్‌లోనే బస ఏర్పాట్లు చేసి తగిన సౌకర్యాలు కల్పిస్తోంది.

ముఖ్యంగా తమకు తమ ఉద్యోగుల సంరక్షణ బాధ్యతలో భయం పట్టుకుందని, దీంతోపాటు తమ పని ఎట్టిపరిస్థితుల్లోను నిలవకూడదని కంపెనీ భావించింది. ఇకపై ఉద్యోగులు సదరు హోటల్‌లో బస చేయాలా వద్దా అనేది ఉద్యోగులే తేల్చుకోవాల్సి వుంటుందని కంపెనీ తెలిపింది.

మరో సాఫ్ట్‌వేర్ కంపెనీకి చెందిన మేనేజింగ్ డైరెక్టర్ శాస్త్రి మాట్లాడుతూ తెలంగాణ వాదులు హింసామార్గాన్నవలంబించారన్నారు. తెలంగాణ అంశంపై పలువురు ఆందోళనకారులు ప్రదర్శనలలో పాల్గొంటుండటంతో వారివలన బీపీఓ, ఐటీ రంగాలకు చాలా ఇబ్బందిగా మారిందన్నారు.
FILE


ఇదిలావుండగా ప్రస్తుతం ఈ రంగాలలోని పలు కంపెనీలకు అంతర్జాతీయ స్థాయిలోనున్న క్లయింట్లకు క్రిస్మస్, నూతన సంవత్సరం సందర్భంగా సెలవులుండటంతో కాస్త ఊరట కలిగించినట్లేనని ఆయన అభిప్రాయపడ్డారు.

బీపీఓ కంపెనీలను నడిపే వారు క్లయింట్ల డిమాండ్‌లను వెంటవెంటనే తీర్చాల్సివుంటుందని, రానున్న రోజుల్లోను పరిస్థితి ఇలాగే ఉంటే మాత్రం తమ పరిస్థితి చాలా దారుణంగా మారేటట్టుందని మరో డైరెక్టర్ చౌధరి ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాగైతే తమ వ్యాపారాలను మరో ప్రాంతానికి మార్చుకోవాల్సిన అవసరం ఉంటుందని ఆయన అన్నారు.

వెబ్దునియా పై చదవండి