'సత్యం'లో ఉద్యోగుల కోతకు రంగం సిద్ధం

సత్యం కప్యూటర్ సంస్థ తన ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకునే ప్రయత్నాలు మొదలు పెట్టింది. దాదాపు 4.5 వేల మంది ఉద్యోగులను తప్పించేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. సత్యంలో సుమారు 51 వేల మంది ఉద్యోగులు ఉన్నారు. ఇందులోంచి 9 శాతం మందిని బయటకు పంపేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

ఇప్పటికే 15 వందల మందిని పీఐపీ కింద పెట్టినట్లు ఉద్యోగ వర్గాల ద్వారా తెలుస్తోంది. పనిని మెరుగు పరుచుకోవాలనే నెపంతో బయటకు పంపేందుకు వారిని జాబితాలో ఉంచినట్లేనని తెలుస్తోంది. వీరు కాకుండా ఇంచుమించు 3 వేల మంది ఉద్యోగులకు గత అప్‌రైజల్‌లో ఇంక్రిమెంట్ ఇవ్వకుండా నిలిపివేశారు. ఇది కూడా వారి తరువాత దశలో బయటకు పంపివేసే మార్గమేననే ఆరోపణలున్నాయి.

ఇదిలా ఉండగా ఈ మధ్యకాలంలో సత్యం కంప్యూటర్స్‌లో పనిచేసే ఉద్యోగులందరికీ అధినేత నుంచి ఒక హెచ్చరిక సందేశం రూపంలో వచ్చింది. డ్రస్ కోడ్‌లో ఎక్కడ తేడా వచ్చినా క్రమశిక్షణా చర్యలు తప్పవని దాని సారాంశం. దీంతో ఉద్యోగుల గుండెల్లో గుబులు పుట్టుకుంది. ఇంక్రిమెంట్లు పొందని దాదాపు వేల మంది ఉద్యోగుల్లో చాలా మంది తమ కొలువులను వదిలి వెళ్ళి పోవడానికి సిద్ధమవుతున్నారు.

వెబ్దునియా పై చదవండి