ఐఫోన్లో ప్రోగ్రాంను రూపొందించిన బుడతడు

యాపిల్ ఐఫోన్లో బొమ్మలు వేసుకునేందుకు ఉపయోగపడే ఒక ప్రోగ్రాంను సింగపూర్‌కు చెందిన తొమ్మిదేళ్ల లిమ్ డింగ్ వెన్ అనే బుడతడు రూపొందించాడు. సింగపూర్‌లో నాలుగో తరగతి చదువుతున్న ఈ చిన్నోడు, మిగతా చిన్నారులకంటే కాస్తంత ప్రత్యేకమైనవాడనే చెప్పుకోవచ్చు.

సాధారణంగా పదేళ్లలోపు వయసు పిల్లలు ఎక్కువగా క్రేయాన్లు, రంగు పెన్సిళ్లు పట్టుకుని వచ్చీరాని బొమ్మలు వేయడం మొదలు పెడుతుంటారు. కానీ... లిమ్ డింగ్ వెన్ రూపొందించిన ప్రోగ్రాం సహాయంతో టచ్ స్క్రీన్ ఐఫోన్‌పై వేళ్లు తాకిస్తూ బొమ్మలు వేసుకోవచ్చు. బొమ్మ నచ్చకపోతే చెరిపేసుకోవచ్చు.

ఐదేళ్లు, మూడేళ్లు వయసు కలిగిన చిన్నారి చిట్టి చెల్లెళ్ళు, తమ్ముళ్ల కోసమే ఈ ప్రత్యేకమైన ప్రోగ్రామ్‌ను తయారు చేశానని లిమ్ గర్వంగా చెబుతున్నాడు. ఇదిలా ఉంటే... కేవలం రెండు వారాల వ్యవధిలోనే నాలుగు వేల మంది ఐఫోన్ యూజర్లు ఈ ప్రోగ్రాంను డౌన్‌లోడ్ చేసుకున్నారంటే.. ఈ బుడతడి అసామాన్య ప్రతిభ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.

సో... పిల్లలూ లిమ్ లాగే మీరు కూడా, మీకు నచ్చిన ఏదో ఒక అంశంపై పట్టు సాధించి, అందరూ మెచ్చుకునేలాగా సరికొత్త ఆవిష్కరణలను ఈ ప్రపంచానికి పరిచయం చేస్తారు కదూ...!

వెబ్దునియా పై చదవండి