"నాసా" టాపర్లుగా నిలిచిన నాగపూర్ విద్యార్థులు

అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ "నాసా" నిర్వహించిన ప్రపంచవ్యాప్త పోటీలలో నాగపూర్‌కి చెందిన విద్యార్థులు ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకున్నారు.

నాసా నిర్వహించిన ఈ "స్పేస్ సెటిల్‌మెంట్ డిజైన్" పోటీలలో నాగపూర్‌లోని సోమాల్వర్ హైస్కూలుకు చెందిన జే పత్రికర్, షంతను మంకే, మాధుర్ బాల్కర్‌లు ప్రథమస్థానంలో నిలిచారు. ఈ పోటీలలో వీరు తాము డిజైన్ చేసిన ప్రాజెక్టుకు "ఈ నెక్ట్స్" అని నామకరణం చేశారు.

ఈ విషయమై సోమాల్వర్ హైస్కూల్ ప్రధానోపాధ్యాయురాలు వీహెచ్ దేశాయ్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ... ఆరవ తరగతి నుంచి తొమ్మిదో తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు కేటాయించిన విభాగంలో తమ విద్యార్థులు తొలి స్థానాన్ని సంపాందించారని సంతోషం వ్యక్తం చేశారు.

అంతేగాకుండా, మే నెల 28వ తేదీన ఒర్లాండోలో జరుగునున్న అంతర్జాతీయ అంతరిక్ష అభివృద్ధి సమావేశానికి కూడా తమ విద్యార్థులను ఆహ్వానించారని దేశాయ్ వెల్లడించారు. ఈ సమావేశంలో తమ విద్యార్థులు అక్కడి శాస్త్రజ్ఞులకు వారు రూపొందించిన ఈ నెక్ట్స్ మోడల్ గురించి వివరిస్తారని ఆమె పేర్కొన్నారు.

వెబ్దునియా పై చదవండి