చిన్నవయసు నుండే పిల్లలకు ఇంట్లో చిన్నచిన్న పనులను నేర్పించాలి. మీ చిన్నారికి బ్రెడ్ శాండ్‌విచ్, పండ్లతో సలాడ్స్ వంటి సాయంకాలపు అల్పాహారం తయారుచేసేటప్పుడు అదెలా చేస్తున్నారో చూపించాలి. అలానే పండ్లరసం తయారీలో కూడా పండ్లను శుభ్రపరచడం వంటి చిన్నచిన్న పనులు వాళ్లతో చేయించాలి. ఇలా చేయడం ద్వారా శుభ్రతతో పాటు పనిని పంచుకోవడం కూడా అలవడుతుంది.
ఇంట్లో పెంచే మొక్కలకు సాయంత్రం పూట నీళ్లు పోయమని చెప్పాలి. అలానే వాటికి పువ్వులు, కాయలు వస్తే.. వారి వల్లే ఆ మొక్క ఆరోగ్యంగా ఉందని ప్రశంసించండి. వారి మనసుల్లో మొక్కలపై ప్రేమ మొదలవుతుంది. తరువాత మరిన్ని రకాల మొక్కలను పెంచుదామని వారే మిమ్మల్ని అడుగుతారు.
పాఠశాల నుండి ఇంటికి వచ్చిన వెంటనే విడిచిన దుస్తులు, పుస్తకాల సంచీ, బూట్లూ వంటివాటిని ఎక్కడపడితే అక్కడ కాకుండా ఓ చోట సర్దేలా అలవాటు చేయాలి. భవిష్యత్తులో వారికి ఇదొక క్రమశిక్షణ అవుతుంది. మీకు పని తగ్గుతుంది. అలానే పుస్తకాల బీరువాను నెలకొకసారి సర్దుకోవడం వారికి నేర్పించాలి. ఇంట్లో ఎక్కడైనా చెత్త ఉంటే తీసి చెత్తబుట్టలో వేయించాలి.