మనోహర్ పారీకర్.. గోవా ముఖ్యమంత్రి కంటే దేశ రక్షణ మంత్రిగానే ఆయన మంచి పాపులర్ అయ్యారు. కానీ, ఆయన మాత్రం దేశ ప్రజల కంటే.. గోవా ప్రజలే తనకు ముఖ్యమని ఆకాంక్షించారు. అందుకే తుది శ్వాస వరకు గోవా ప్రజలకు నీతి నిజాయితీతో పని చేస్తానంటూ గతంలో ప్రకటించారు. ఆ విధంగానే ఆయన తుది శ్వాస వరకు గోవా ప్రజల కోసం పని చేశారు.
గోవా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న, దేశ రక్షణ మంత్రిగా ఉన్నప్పటికీ మనోహర్ పారీకర్ మాత్రం ఎప్పుడూ చాలా సాదాసీదాగా ఉండేవారు. కానీ, తన విధులను మాత్రం చాలా అంకితభావంతో పని చేశారు. అందుకే ఆయన రక్షణ మంత్రిగా ఉన్న సమయంలో భారత భద్రతా బలగాలు పాక్ గడ్డపైకి వెళ్లి మెరుపుదాడులు నిర్వహించాయి.
అంతేకాకుండా క్లోమగ్రంథి కేన్సర్‌తో బాధపడుతూ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నప్పటికీ ముక్కుకు ట్యూబ్‌తోనే అసెంబ్లీకి వచ్చారు,. జనవరి 30వ తేదీన బడ్జెట్ ప్రవేశపెడుతూ "నేను ఫుల్ జోష్‌లో ఉన్నాను. ఇవాళ మరోమారు వాగ్దానం చేస్తున్నాను. నీతి నిజాయితీ, అంకితభావంతో తుదిశ్వాస వరకు గోవా ప్రజలకు సేవ చేస్తూనే ఉంటాను" అని ఉద్వేగభరితంగా ప్రసంగించారు.
గోవా ప్రజలను అమితంగా ఇష్టపడే పారీకర్... ఆయన తుది శ్వాస ఉన్నంతవరకు మాతృభూమి సేవలోనే తరించారు. ఆయన అన్నట్టుగానే ముఖ్యమంత్రిగా విధులు నిర్వహిస్తూనే తుదిశ్వాస విడిచారు. ఆయన మాటలను తథాస్తు దేవలు విన్నట్టుగా ఉన్నారు.. అందుకే మనోహర్ పారీకర్ కన్నుమూసే సమయంలో కూడా ప్రజాసేవలోనే ఉన్నారని ఆయన సన్నిహితులు కన్నీటిపర్యంతమవుతూ గుర్తుచేసుకుంటున్నారు.