సెప్టెంబరు 5 టీచర్స్ డే(గురు పూజోత్సవం).. సెలబ్రేషన్స్‌ ప్రత్యేకత

బుధవారం, 4 సెప్టెంబరు 2019 (14:14 IST)
హాయ్... పిల్లలూ...!! హ్యాపీ టీచర్స్ డే..
 
మీ అందరికి టీచర్స్‌ డే గురించి పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు అనుకుంటా.. ఎందుకంటే.. మీరు ఈ పాటికే ఫుల్ సెలబ్రేషన్స్‌లో ఉండి ఉంటారు కదా...!
 
నేను చదివే రోజుల్లో స్కూల్లో ఈ రోజు కోసం చాలా ఎదురుచూసే వాళ్లం. ప్రత్యేకంగా ఉపాధ్యాయ దినోత్సవం, బాలల దినోత్సవం కోసం చాలా ఉత్సాహంగా ఎదురుచూసే వాళ్లం. ఉపాధ్యాయ దినోత్సవం నాడు పిల్లలు ఉపాధ్యాయులను ఆనందింపజేసేవాళ్లం. బాలల దినోత్సవం నాడు టీచర్స్ పిల్లలను ఆనందింపజేస్తారు. ప్రతి సంవత్సరం మా స్కూలు పిల్లలందరం కలిసి ఈ పండుగను భలే సెలబ్రేట్ చేసుకునే వాళ్లం. 
 
టీచర్స్ డేకు వారం రోజుల ముందు నుంచే మా స్కూల్‌లో సందడి మొదలయ్యేది. డ్రామాలు, డ్యాన్సులు, పాటల పోటీలు, ఆటలు పోటీలు ఇలా.. ఒక వారం రోజుల పాటు పండుగ వాతావరణమే..! మీకో విషయం తెల్సా ఈ వారం రోజుల పాటు మా స్కూల్‌లో ఒక్కరు కూడా శెలవు పెట్టే వాళ్లం కాదు.
 
స్కూలును రంగు రంగు కాగితాలతో అలంకరించే వాళ్లం. పండుగ రోజున టీచర్లకు బహుమతులు ఇచ్చేవాళ్లం. అంతే కాదు మా బ్యాచ్‌లో కొందరు టీచర్ల వేషం వేసేవారు. అచ్చం మా టీచర్ల మాదిరిగానే వారిని అనుకరించే వాళ్లు. అది చూసి మా ఉపాధ్యాయులు భలే మురిసిపోయేవారు.
 
ఇంతకీ మనం టీచర్స్ డే ఎందుకు జరుపుకుంటామో తెల్సా... భారతదేశపు మొట్టమొదటి ఉప రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ పుట్టిన రోజును పురస్కరించుకొని మనం ఈ టీచర్స్ డేను జరుపుకుంటాం. 1962 నుంచి ఇలా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది.
 
ఒకరోజు సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి దగ్గరికి కొందరు శిష్యులు మరియు మిత్రులు, పుట్టినరోజు జరపటానికి వచ్చినప్పుడు, "నా పుట్టిన రోజును వేరుగా జరిపే బదులు, దానిని ఉపాధ్యాయ దినోత్సవంగా నిర్వహిస్తే నేను ఎంతో గర్విస్తాను" అని ఆయన అన్నారు.
 
అలా అప్పటి నుంచి మనం విద్యార్థులు - ఉప్యాధ్యాయుల సంబంధ బాంధవ్యాలకు గుర్తుగా మనం ఈ వేడుకను జరుపుకుంటున్నాం. అయితే ప్రపంచవ్యాప్తంగా మాత్రం అక్టోబర్ 5న "ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సం" జరుపుకుంటారు. 1994వ సంవత్సరం నుంచి ఇలా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. గురు శిష్యుల మధ్య సంబంధానికి ప్రతీకగా ప్రపంచవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడం విశేషం.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు