పరీక్షల్లో కాపీ కొడుతుంటే పట్టుకున్నారనీ..!

పరీక్షల్లో కాపీ కొడుతుండగా, ఇన్విజిలేటర్ పట్టుకున్నారని... పదవ తరగతి చదివే విద్యార్థిని, అవమానం భరించలేక ఏడంతస్తుల భవనం పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. కాగా, ఈ దుర్ఘటన ముంబైలోని ఘట్కోపర్ ప్రాంతంలో జరిగింది.

దీపక్ దేశాయ్ అనే వ్యాపారి కుమార్తె అయిన భవి దేశాయ్... పుణె విద్యాభవన్ స్కూల్లో పదోతరగతి చదువుతోంది. జాగ్రఫీ పరీక్షలు జరుగుతుండగా, కాపీ కొడుతూ ఆమె పట్టుబడింది. దీంతో ఉపాధ్యాయులు ఆ అమ్మాయి హాల్‌టికెట్ లాక్కుని, కొంచెం భయపెట్టి... అనంతరం తిరిగీ పరీక్ష రాసేందుకు అనుమతినిచ్చారు.

ఇదివరకెన్నడూ కాపీ కొట్టని భవి దేశాయ్.. తొలిసారిగా కాపీ కొట్టేందుకు ప్రయత్నించి, పట్టుబడటంతో అవమానం భారం తాళలేక, తాము నివాసం ఉండే ఏడంతస్తుల అపార్ట్‌మెంట్ భవనం నుంచి కిందికి దూకి ఆత్మహత్య చేసుకుంది.

ఇదిలా ఉంటే... చదువులో సాధారణ విద్యార్థిని ఉండే భవి.. పరీక్షలు సరిగా రాయని కారణంగానే ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని పాఠశాల ప్రిన్సిపల్ చేతులు దులుపుకున్నారు. అయితే.. తమ కుమార్తె ఇంతటి అఘాయిత్యానికి ఎందుకు పాల్పడిందో తెలియడంలేదని భవి దేశాయ్ తల్లిదండ్రులు భోరున విలపిస్తున్నారు.

ఈ సంగతలా పక్కన పెడితే పిల్లలూ... పరీక్షల కోసం సరిగా చదువుకోని సందర్భాల్లోనే ఇలాంటి కాపీ కొట్టే పనులకు పూనుకోవాల్సి వస్తుంది. ఎప్పుడు కూడా కాపీ కొట్టని భవి దేశాయ్.. తొలిసారిగా కాపీ కొట్టేందుకు ప్రయత్నించడం, అవమాన భారంతో ఆత్మహత్య చేసుకోవడం... అంతా చదివారు కదూ...! భవిని ఒక ఉదాహరణగా తీసుకుని కాపీ కొట్టడం లాంటి పనులు చేయకుండా, బుద్ధిగా చదువుకుని జీవితంలో మంచి పేరు తెచ్చుకుంటారని ఆశిస్తూ..!

వెబ్దునియా పై చదవండి