వంపు కర్రు కాల్చి వంపు దీర్చగవచ్చు కొండలన్ని పిండి గొట్టవచ్చు కఠినచిత్తు మనసు కరిగింపగా రాదు విశ్వదాభిరామ వినుర వేమా..!!
తాత్పర్యం : ఇనుము పైకి కఠోరంగా కనిపించినా, దాన్ని కాలిస్తే మెత్తబడే గుణం ఉంది. అందువల్ల ఇనుపకడ్డీ ఎక్కడైనా వంకరగా ఉంటే, వెంటనే దాన్ని కాల్చి ఆ వంపును కాస్తా సరిచేయవచ్చు. రాయికూడా అంతే, పైకి అది ఎంతో గట్టిగా కనిపించినా దానికి పొడిగా మారే స్వభావం ఉంటుంది. అందుకే పర్వతాలను సైతం కొట్టి పిండి చేయవచ్చు అని అంటారు. కానీ.. ఇనుముకంటే, రాయికంటే కఠినమైన వారి మనస్సును మాత్రం ఎవ్వరూ కరిగించలేరు. అందుకే ఆ ప్రయత్నాల్లో విలువైన కాలాన్ని వృధా చేయవద్దు అని ఈ పద్యం యొక్క భావం.