ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దళిత బాలికపై అత్యాచారం జరిగింది. పాఠశాల ప్రిన్సిపాల్ గదిలోనే ఈ దారుణానికి ఇరుగు పొరుగున ఉండే విద్యార్థులు కావడం గమనార్హం. అత్యాచార వీడియోను ఆన్‌లైన్‌లో పోస్ట్ చేశాడు. ఈ దారుణం యూపీలోని మురాదాబాద్‌లో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
మురదాబాద్‌లోని ఓ ప్రభుత్వ పాఠశాలకు చెందిన ప్రిన్సిపాల్ కార్యాలయంలోనే 12 ఏళ్ల దళిత బాలికపై ఐదుగురు తోటి విద్యార్థులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలికి శీతల పానీయంలో మత్తుమందు కలిపి ఇచ్చి ఈ అఘాయిత్యానికి ఒడిగట్టారు. ఇంతటితో ఆగకుండా ఈ దారుణాన్ని వీడియో తీసి, ఆన్‌లైన్‌లో కూడా ప్రచారం చేశారు. ఈ దారుణ ఘటనపై బాధితురాలి తల్లి ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఐదుగురు నిందితులను మంగళవారం సాయంత్రం అదుపులోకి తీసుకున్నారు.
వివరాల్లోకి వెళితే, మే 8వ తేదీన ఈ దారుణం చోటుచేసుకుంది. నిందితులైన ఐదుగురు బాలురు కూడా దళితులే కావడం, 12 నుంచి 15 ఏళ్ల మధ్య వయసు వారే కావడం గమనార్హం. వీరంతా బాధితురాలికి పొరుగింటి వారని, సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒకే పాఠశాలలో చదువుతున్నారని అధికారులు తెలిపారు. బాధితురాలు మాత్రం వేరే పాఠశాలలో చదువుతోంది. ఘటన జరిగిన వెంటనే ఆ బాలిక భయంతో ఈ విషయాన్ని ఎవరికీ చెప్పలేదు.
కొద్దిరోజులుగా తన కుమార్తె తీవ్రమైన దిగులుతో ఉండటం గమనించిన తల్లి, ఏం జరిగిందని పలుమార్లు ఆరా తీసింది. అయినా బాలిక నోరు మెదపలేదు. అయితే, సోమవారం రాత్రి ఓ పొరుగింటి వ్యక్తి ఆ దారుణమైన వీడియోను చూపించడంతో అసలు విషయం తల్లికి తెలిసింది. వీడియో చూపి నిలదీయడంతో, బాలిక జరిగిన ఘోరాన్ని ఏడుస్తూ వివరించింది. మే 8వ తేదీ సాయంత్రం 4 గంటల సమయంలో ఇంటి బయట ఆడుకుంటున్న తనను, ఆ ఐదుగురు బాలురు ఏదో కొనిస్తామని చెప్పి దగ్గరులోని జూనియర్ హైస్కూల్‌కు తీసుకెళ్లారని తెలిపింది.
నిందితుల్లో ఒక బాలుడి తండ్రి ఆ పాఠశాలలో వాచ్‌మన్‌గా పనిచేస్తున్నాడు. తండ్రి ఇంట్లో ఉంచిన పాఠశాల తాళాలను ఆ బాలుడు తీసుకువచ్చాడు. పాఠశాలలోకి ప్రవేశించాక, ప్రధాన ద్వారానికి తాళం వేసి, బాలికను ప్రిన్సిపాల్ కార్యాలయంలోకి తీసుకెళ్లారు. అక్కడ శీతల పానీయంలో మత్తుమందు కలిపి బలవంతంగా తాగించారు. బాలిక స్పృహ కోల్పోయాక, ఆమెపై అత్యాచారానికి పాల్పడి, ఆ దారుణాన్ని మొబైల్ ఫోనులో చిత్రీకరించారు. ఈ విషయం ఎవరికైనా చెబితే వీడియోను ఆన్‌లైనులో పెడతామని, తల్లిదండ్రులను చంపేస్తామని బెదిరించారు. అయితే, ఆ వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. తన ఫోనులో ఈ క్లిప్ చూసిన పొరుగింటి వ్యక్తి ద్వారానే బాలిక తల్లికి ఈ విషయం తెలిసింది.
ఈ ఘటనపై ఎస్ఎస్పీ సత్పాల్ అంటిల్ మాట్లాడుతూ, కేసు నమోదు చేసి ఐదుగురు నిందితులను అరెస్టు చేశాం. వారందరికీ వైద్య పరీక్షలు నిర్వహించగా, 12 నుంచి 15 ఏళ్ల మధ్య వయసున్న మైనర్లుగా నిర్ధారణ అయింది. వీరంతా నగరంలోని ఓ పాఠశాలలో 7 నుంచి 9వ తరగతి చదువుతున్నారని తెలిపారు.