విజయవాడ : కృష్ణా పుష్కరాల సందర్భంగా తొలిరోజు మద్యాహ్నం వరకూ 4 లక్షల మంది పుష్కర స్నానాలు ఆచరించారు. ఇది వాస్తవానికి చాలా తక్కువ సంఖ్య. వరలక్ష్మీ వ్రతం సందర్భంగా పుష్కర యాత్రికుల సంఖ్య తగ్గి ఉండవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. రేపటి నుంచి మూడు రోజులపాటు శెలవులు కావడంతో భక్తుల రద్దీ పెరిగే అవకాశం ఉన్న నేపధ్యంలో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని హోం మంత్రి చినరాజప్ప చెప్పారు.
కంట్రోల్ రూం సహకారంతో ఘాట్లలో రద్దీని గమనించి ప్రజలను ఖాళీగా ఉన్న ఘాట్లలోకి మళ్లిస్తున్నామని చెప్పారు. ఈ పుష్కరాల్లో 31 వేల మంది పోలీసులు విధులు నిర్వహిస్తున్నారని ఏపీ డీజీపీ సాంబశివరావు తెలిపారు. విధి నిర్వహణలో ఉండి ప్రాణాలు విడిచిన కానిస్టేబుల్ కుటుంబాన్ని ఆదుకుంటామని, వారి కుటుంబానికి 10 లక్షలు ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చెప్పారు.
33 మంది క్రిమినల్స్, 5 గ్యాంగ్స్‌ను గుర్తించామని, రద్దీగా ఉండే ప్రాంతాల్లో దొంగతనాలు చేస్తున్న వారినీ అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా 13 వందల సీసీ కెమేరాలతో నిఘా ఏర్పాటు చేశామని చెప్పారు.