కృష్ణా పుష్క‌రాలు... మ‌ట‌న్ చికెన్ షాపులు బంద్... గొల్లుమంటున్న చికెన్ చాచీలు!

మంగళవారం, 9 ఆగస్టు 2016 (15:36 IST)
విజ‌య‌వాడ ‌: ఉరుము ఉరిమి మంగ‌ళం మీద‌ప‌డిన‌ట్లు... కృష్ణా పుష్కరాలు వ‌చ్చి... మాంసాహార ప్రియుల‌పై ప‌డింది. కృష్ణా పుష్క‌రాల సంద‌ర్భంగా, విజయవాడలో మాంసం అమ్మకాలు చేయవద్దని స్థానిక యంత్రాంగం ఆదేశించడం వివాదంగా మారుతోంది. మామూలుగా అయితే పుష్కర స్నానాలు జరిగే నదీ తీరానికి 500 మీటర్ల వరకు ఇలాంటి ఆదేశాలు ఇస్తుంటారు. కానీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పుష్కరాల సందర్భంగా విజయవాడ అంతటా మాంసం విక్రయాలు ఉండరాదని సూచించారు. దీంతో ఇది పెద్ద ఇబ్బందిగా మారిందని అధికారులే అంటున్నారు. 
 
వివిధ మతాలవారు, మాంసాహారులు ఉండే విజయవాడలో మాంసాహారులను ఇబ్బందిపెట్టడం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. పైగా వేలాదిమంది మటన్, చికన్ విక్రయదారులు ఈ నెల నుంచి 9 నుంచి 23 వరకు తమ వ్యాపారాలను మానుకోవడం వల్ల ఆర్థికంగా నష్టపోతారని వాపోతున్నారు. స్టార్ హోటళ్ల వారైతే తాము అలాంటి ఆదేశాలను పాటించలేమని చెబుతున్నారు. 
 
దేవాలయాలను కూల్చుతూ ఒక వైపు, మాంసాహారాన్ని నిషేధిస్తూ మరోవైపు ప్రభుత్వం పరస్పర విరుద్ధంగా వ్యవహరిస్తోందని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే, ప‌విత్ర పుష్క‌రాల స‌మ‌యంలో 12 రోజుల పాటు మాంసం తిన‌కుండా ఉండ‌లేరా అంటూ, కొంద‌రు పురోహితులు వాదిస్తున్నారు. అయినా, మెగా ఉత్స‌వానికి అంద‌రూ అంతో ఇంతో స‌హ‌కరించ‌డం... మంచిద‌ని పేర్కొంటున్నారు. మ‌రి మ‌ట‌న్ లేనిదే ముద్ద దిగ‌ని వారికి ఈ 12 రోజులు ప‌స్తులేనా... వేచి చూడాలి.

వెబ్దునియా పై చదవండి