కృష్ణా పుష్కరాల 12 రోజుల్లో... ఏయే రోజు ఏ దానం...?
బుధవారం, 3 ఆగస్టు 2016 (18:00 IST)
విజయవాడ: ఆగస్టు 12 నుంచి 23 వరకూ 12 రోజుల పాటు కృష్ణా పుష్కరాలు జరుగుతున్నాయి. ఈ సమయంలో పితృకర్మలతో పాటు పుష్కరుడికి ఏ రోజు ఏదానం చేస్తే ఏ ఫలితం ఉంటుందో తెలుసుకుందాం.
మొదటి రోజు: బంగారం, వెండి, ధాన్యం, భూమి దానం చేయాలి.
ఫలితం: బంగారం, వెండి దానం చేయడం వల్ల ఇహలోక సుఖభోగాలతో పాటు సూర్యచంద్ర లోకాల ప్రాప్తి కలుగుతుంది. భూదానం వల్ల భూపతిత్వం వస్తుంది. ధాన్య దానం వల్ల కుబేర సంపద కలిగిస్తుంది.
రెండో రోజు: గోవు, వస్త్రం, రత్నం, లవణ దానాలు చేయాలి.
ఫలితం: గోవు దానం చేయడం వల్ల రుద్రలోక ప్రాప్తి, వస్త్ర దానం వల్ల వసులోక ప్రాప్తి, రత్న దానం వల్ల సార్వభౌమత్వం, లవణ దానం వల్ల శరీర ఆరోగ్యం కలుగుతాయి.
మూడో రోజు: శాఖ, ఫల, గుడాలు (గుగ్గిళ్లు), అశ్వదానాలు చేయాలి.
ఫలితం: కుబేర, అశ్వనీ దేవతాలోక సౌఖ్యాలు అనుభవించి, ఇంద్రసమాన వైభవం పొందుతారు.
నాలుగవ రోజు: పాలు, తేనె, నెయ్యి, నూనె దానం చేయాలి.
ఫలితం: పాలు దానం చేస్తే సిరిసంపదలు కలుగుతాయి. తేనె దానం చేస్తే వైకుంఠ నగర ప్రవేశం, ఘృత (నెయ్యి) దానం వల్ల ఆయువు వృద్ధి చెందుతుంది. తైల(నూనె) దానం వల్ల నరక నివారణ కలుగుతుంది.