గవర్నర్ పదవికి రాజీనామా చేయడం మంచిదే అనిపిస్తుంది : తమిళిసై సౌందర్ రాజన్

వరుణ్

గురువారం, 28 మార్చి 2024 (11:35 IST)
తెలంగాణ రాష్ట్ర గవర్నర్ పదవికి రాజీనామా చేయడం మంచిదే అనిపిస్తుందని సౌత్ చెన్నై లోక్‌సభ స్థానం నుంచి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న డాక్టర్ తమిళిసై సౌందర్ రాజన్ అన్నారు. ఆమె తన గెలుపు కోసం ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. నామినేషన్ పత్రాలు దాఖలు చేసిన వెంటనే ఆమె పార్టీ శ్రేణులతో కలిసి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. చెన్నై కోయంబేడు శివాలం నుంచి ఆమె తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. 
 
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, తెలంగాణ గవర్నర్ పదవికి రాజీనామా చేయడం మంచిదే అని పిస్తుందన్నారు. రోడ్డు వెంట ఉన్న ఓ దుకాణంలో వడలు కొనుగోలు చేసి ఆరగించానని, దుకాణదారుడు డిజిటల్ పేమెంట్ నిర్వహిస్తున్నారని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం గురించి ఇంతకన్నా ఇంకెలా చెప్పాలని ఆమె ప్రశ్నించారు. నాలుగున్నరేళ్ల తర్వాత ప్రజలను ఇలా కలుసుకుంటున్నానని చెప్పారు. ప్రజలు ఉత్సాహంగా ఆహ్వానించడాన్ని చూస్తుంటే గవర్నర్ పదవికి రాజీనామా చేయడం మంచిదే అనిపిస్తుందని వ్యాఖ్యానించారు. 
 
లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు డబ్బు లేదు : నిర్మలా సీతారామన్ 
 
లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే స్థాయి తనగి కాదని, అంత డబ్బు తన వద్ద లేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవసరమైన నిధులు తన వద్ద లేవని.. అందుకే పార్టీ ప్రతిపాదనను తిరస్కరించినట్టు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ లేదా తమిళనాడు నుంచి పోటీ చేసేందుకు భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా అవకాశం కల్పించిన మాట నిజమేనని, కానీ, ఎన్నికల్లో పోటీ చేసేంత డబ్బు తన వద్ద లేదని చెప్పి ఆ ప్రతిపాదనను తిరస్కరించినట్టు చెప్పారు. 
 
'ఒక వారం, పది రోజులు ఆలోచించిన తర్వాత కుదరకపోవచ్చు అని చెప్పా. ఎన్నికల్లో పోటీ చేసేందుకు నా దగ్గర అంత డబ్బు లేదు. ఆంధ్రప్రదేశ్ లేదా తమిళనాడు.. ఏదైనా నాకో సమస్య ఉంది. అక్కడ గెలుపునకు కులం, మతం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. అవన్నీ చేయలేనని, అందుకే పోటీ చేయనని చెప్పాను. వారు నా వాదనను అంగీకరించడం గొప్ప విషయం. అందుకే నేను ఎన్నికల్లో పోటీ చేయడం లేదు' అని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. 
 
అదేసమయంలో పార్టీకి చెందిన ఇతర అభ్యర్థుల కోసం ఎన్నికల్లో తాను ప్రచారం చేస్తానన్నారు. దేశ ఆర్థిక మంత్రిగా ఉన్న వ్యక్తి వద్ద ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవసరమైన నిధులు లేవా? అని అడిగిన ప్రశ్నకు నిర్మలా సమాధానమిచ్చారు. 'నా జీతం, నా సంపద, నా పొదుపు మాత్రమే నావి. కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా మాత్రం నాది కాదు కదా..' అని సమాధానమిచ్చారు. 
 
ఇదిలాఉంటే, రాజ్యసభ నుంచి ప్రాతినిధ్యం వహిస్తోన్న అనేక మంది భాజపా నేతలను లోక్‌సభ ఎన్నికల బరిలో ఆ పార్టీ దింపుతోంది. పీయూష్ గోయల్, భూపేంద్ర యాదవ్, చంద్రశేఖర్, మాన్‌సుఖ్ మాండవీయ, జ్యోతిరాదిత్య సింధియా వంటి నేతలు ఈ జాబితాలో ఉన్నారు. నిర్మలా సీతారామన్ కర్ణాటక నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తోన్న విషయం తెలిసిందే. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు