మోడీ ఓట్ల సునామీ : ముగ్గురు కేంద్ర మంత్రుల ఓటమి

శుక్రవారం, 24 మే 2019 (08:34 IST)
17వ సార్వత్రిక ఎన్నికల్లో నరేంద్ర మోడీ ఓట్ల సునామీ సృష్టించారు. ఫలితంగా కమలదళం 301 సీట్లను కైవసం చేసుకుని అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఆ పార్టీ సారథ్యంలోని ఎన్డీయే కూటమి 350 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించింది. 
 
అయితే, మోడీ సునామీ దెబ్బకు బడాబడా పార్టీల పీఠాలు కదిలిపోయాయి. ఇలాంటి సానుకూల పవనాల్లో అనేక మంది బీజేపీ అభ్యర్థులు, మంత్రుల వైఫల్యాలు పెద్దగా కనిపించలేదు. దీంతో అతి సునాయాసంగా వారిని విజయం వరించింది.
 
అయితే, బీజేపీకి చెందిన ముగ్గురు కేంద్ర మంత్రులు మాత్రం ఓడిపోయారు. పంజాబ్ రాష్ట్రం నుంచి పోటీ చేసిన కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురి 99 వేల ఓట్ల తేడాతో చిత్తుగా ఓడిపోగా, ఇక్కడి నుంచి పోటీ చేసిన కాంగ్రెస్‌ అభ్యర్థి గుర్జీత్‌సింగ్‌ ఔజ్లా విజయం సాధించారు. 
 
అదేవిధంగా కేరళలోని ఎర్నాకులం నుంచి బరిలోకి దిగిన కేంద్రమంత్రి కె.జె.అల్ఫోన్స్‌ 3.50 లక్షల ఓట్ల తేడాతో ఓటమిని చవిచూశారు. ఈ సీటు నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థి హిబి ఎడెన్‌ గెలుపొందారు. ఇక ఉత్తర ప్రదేశ్‌లోని గాజీపూర్‌ నుంచి పోటీచేసిన కేంద్రమంత్రి మనోజ్‌సిన్హా 1.15 లక్షల ఓట్ల తేడాతో ఓటమిని చవిచూశారు. ఇక్కడ బీఎస్పీ అభ్యర్థి అఫ్జల్‌ అన్సారీ విజయఢంకా మోగించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు