మహాశివరాత్రి రోజున సూర్యోదయానికి ముందే లేచి తలస్నానం చేసి పువ్వులు, ఫలాలతో శివునికి పూజ చేయాలి. అభిషేకాలు చేయించాలి. రాత్రి పూట దేవాలయాల్లో జరిగే పూజల్లో పాల్గొనాలి. ఆ రోజున జాగరణ చేయాలి. అసత్యాలు పలకడం, ఇతరులను దూషించకూడదు. తప్పులు చేయకూడదు. చలికాలానికి స్వస్తి చెప్తూ.. మహాశివరాత్రి పర్వదినం వస్తుంది.
శివరాత్రి పూట జాగరణ చేస్తే తెలిసీ, తెలియక తప్పుల పాపాలు తొలగిపోతాయి. శివసాయుజ్యం కైలాస ప్రాప్తి తథ్యమని
ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు. శివరాత్రి నాటి జాగరణ ద్వారా పునర్జన్మంటూ వుండదని స్కాంద పురాణం చెప్తోంది. జాగారం చేసే సమయంలో భగవన్నామ స్మరణం చేస్తే సమస్త పాపాలు హరిస్తాయని విశ్వాసం.
శివరాత్రి నాడు చేసే జాగారాన్ని వ్యర్థ ప్రసంగాలతో కాకుండా శివనామస్మరణతో పూర్తి చేయాలి. జాగారం చేసే వారు శివ అష్టోత్తరము, శివ పంచాక్షరీ స్తోత్రం, దారిద్ర్యదహన స్తోత్రం, శివసహస్రనామము, శివారాధన, శివపురాణములతో లేదా పంచాక్షరీ మంత్రాన్ని 108 సార్లు మహేశ్వరుడిని పూజించడం మంచిది.
ఇంకా ఆలయాల్లో ఏకాదశరుద్రాభిషేకం, 108 బిందెలతో రుద్రాభిషేకం, శివ కళ్యాణం చేయిస్తే వంశాభివృద్ధి, సంతానప్రాప్తి చేకూరుతుంది. వివాహాల్లో అడ్డంకులు తొలగిపోతాయి. అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయని పండితులు సూచిస్తున్నారు.