భూతల స్వర్గం... అరకులోయ

మంగళవారం, 25 సెప్టెంబరు 2007 (17:08 IST)
యిమ్మడిశెట్టి వెంకటేశ్వరరావు
అరకులోయ... అంటేనే మన కళ్ల ముందు ప్రకృతి రమణీయత ప్రత్యక్షమవుతుంది. అంతెందుకు... ఈ ప్రదేశాన్ని సందర్శించిన వారు అరకును భూతల స్వర్గంగా అభివర్ణిస్తారు. అరకులోయకు, మన రాష్ట్రంలోనే కాదు, దేశంలోనూ ఓ అద్భుత పర్యాటక ప్రాంతంగా పేరుంది. విశాఖపట్నం జిల్లాకు చెందిన అరకు లోయ సముద్ర మట్టానికి 900 మీటర్ల ఎత్తులో ఉంటుంది. అరకులోయ అణువణువున ప్రకృతి రమణీయత తాండవిస్తుంది. అద్భుత పర్వత పంక్తులు ఇక్కడ దర్శనమిస్తాయి.

విశాఖపట్టణానికి ఈ అందాల లోయ 115 కిలోమీటర్ల దూరంలో ఉంది. దాదాపు ఒరిస్సా రాష్ట్రం సరిహద్దుకు ఆనుకుని ఉన్న అరకులోయ నయగారాలను ఒలికించే జలపాతాలతోనూ, ఆహ్లాదకరమైన వాతావరణంతో మైమరపిస్తుంది. ఇక్కడ ప్రకృతి సోయగాన్ని ప్రత్యక్షంగా వీక్షించాల్సిందేగానీ వర్ణించనలవి కాదు. దాదాపు 36 కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉన్న ఈ అందాల అరకు దర్శింవలసిన ప్రాంతం.

అరకు లోయకు ఘాట్ రోడ్డు మార్గం ద్వారా వెళుతున్నప్పుడు రోడ్డుకిరువైపుల ఉన్న దట్టమైన అడవులు కనువిందు చేస్తాయి. ఇక్కడ ట్రెక్కింగ్ భలే సరదాగా ఉంటుంది. మొత్తం 46 టన్నెళ్లు, బ్రిడ్జిలు మీకు స్వాగతం పలుకుతాయి. ఇక అరకులోయకు వెళ్లే మార్గమధ్యంలో దర్శనమిచ్చే అనంతగిరి కొండలు కాఫీ తోటలకు ప్రసిద్ధి. అరకులోయను సందర్శించే వారు తప్పక వెళ్లవలసిన చోటు బొర్రా గుహలు. ఈ గుహలు అరకులోయకు సుమారు 29 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి.

అరకు వెళ్లటం ఎలా
విమానం ద్వారా...
సమీప విమానాశ్రయం విశాఖపట్టణం. ఈ విమానాశ్రయానికి 112 కిలో మీటర్ల దూరంలో అరకులోయ ఉంది.
రైలు ద్వారా...
అరకులోయ చేరుకునేందుకు రైలు సౌకర్యం ఉన్నది.
రోడ్డు ద్వారా...
విశాఖపట్టణం నుంచి ఏపీ టూరిజం వారి బస్సు సౌకర్యం ఉంది.
ఎక్కడ బస చేయాలి...
కాటేజీలు & విడిది గృహాలు
ఆర్ & బి విడిది గృహాలు
ఏపీ టూరిజం మయూరి కాంప్లెక్స్

వెబ్దునియా పై చదవండి