అద్వైత భావనల, హొయసల రాజసాల "చిక్‌మగళూరు"

FILE
పశ్చిమ కనుమల పర్వత శ్రేణుల్లో తుంగ మరియు భద్ర నదుల జన్మస్థలంగా.. అత్యంత ఎత్తులో ఉండే పర్వ శ్రేణులతో, ప్రకృతి రమణీయ దృశ్యాలు కలిగిన కెమ్మనగుండి, కుద్రేముఖ్ కొండల సౌందర్యంతో, మాణిక్యధార, కల్లథిగిరి జలపాతాల పరవళ్లతో... భారతదేశంలోనే మొట్టమొదటగా కాఫీ తోటలు పెంచబడ్డ ప్రాంతంగా.. పర్యాటకులకు నేత్రానందం కలిగింపజేస్తున్న ప్రాంతమే "చిక్‌మగళూరు".

కర్ణాటక రాష్ట్రంలోని ప్రముఖ జిల్లాగా, పట్టణంగా పేరుపొందిన చిక్‌మగళూరు పర్వత సౌందర్యాలకు, ప్రకృతి పచ్చగా పరచుకున్న కొండలకు, శంకరాచార్యుల అద్వైత భావనలకు, హొయసల రాజుల రాజసానికి, కుద్రేముఖ్, భద్ర అభయారణ్యాల వన్యప్రాణి సంరక్షణా కేంద్రాలకు.. మల్లెమొగ్గల్లాంటి నీటి తుంపరలతో జలజలా పారే జలపాతాలకు.. ఇలా ఒకటేమిటి లోకంలోని సమస్త ప్రకృతి సౌందర్యానికి పట్టుగొమ్మలాగా వెలుగొందుతోంది.

చిక్‌మగళూరు అనే పేరు జిల్లా రాజధాని చిక్‌మగళూరు పట్టణం నుండి వచ్చింది. చిక్‌మగళూరు అంటే కన్నడ భాషలో చిన్న కూతురు ఊరు అని అర్థం. సేక్రపట్న రాజైన రుక్మాంగద చిన్న కూతురుకు కట్నంగా ఇవ్వబడడం వల్ల ఈ పట్టణానికి చిక్‌మగళూరు అని పేరు వచ్చిందని చెబుతుంటారు. రుక్మాంగద పెద్ద కూతురు పేరు మీద చిక్‌మగళూరుకు 5 కి.మీ దూరంలో హిరెమగళూరు ఉంది.
ముత్యాల జల్లు కురిసే..!
చిక్‌మగళూరు మాణిక్యధార, కళ్ళహతిగిరి, హెబ్బె, శాంతి, హనుమాన్ గుండి, కదంబి జలపాతాలకు కూడా నిలయం. మాణిక్యధార జలపాతం బుడాన్ గిరి దత్తాత్రేయ పీఠానికి దగ్గర్లో ఉంటుంది. ఈ జలపాతంలో పైనుంచి పడే నీరు ముత్యాల జల్లు పడుతున్నట్లు పర్యాటకులకు అమితానందాన్ని...


చిక్‌మగళూరు కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరు నుండి 251 కి.మీ దూరంలో "బాబా బుడన్‌ కొండల" మధ్య అభయారణ్యాలలో నెలవై ఉంది. కర్ణాటక రాష్ట్రంలోనే అత్యున్నత పర్వత శిఖరం "ముల్లాయనగిరి కొండలు" ఈ ప్రాంతంలోనే సముద్రమట్టానికి 1926 మీటర్ల ఎత్తులో ఉన్నాయి. ఈ జిల్లాలో భద్ర, తుంగ, హేమవతి, నేత్రావతి, వేదవతి నదులు సంవత్సరం పొడవునా ప్రవహిస్తుంటాయి.

ఈ ప్రాంతంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాల విషయానికి వస్తే...

కెమ్మనగుండి : బాబా బుడన్ కొండల మధ్య చిక్‌మంగళూరు పట్టణానికి 55 కిలోమీటర్ల దూరంలో కెమ్మనగుండి పర్వత కేంద్రం ఉంది. ఈ ప్రాంతంలో వాడేయార్ రాజు కృష్ణరాజ వాడేయార్ వేసవి విడిది చేసేవారు కాబట్టి ఈ పర్వతశ్రేణులను కేఆర్ కొండలు అని కూడా పిలుస్తుంటారు. సముద్ర మట్టానికి 1,434 మీటర్ల ఎత్తులో దట్టమైన అరణ్యాల మధ్యలో ఉన్న ప్రాంతం.. సంవత్సరం పొడవునా సెలయేటి గలగలతో నిత్యశోభితంగా ఉంటుంది.

అనేక రకాల పూల తోటలతో, ముఖ్యంగా గులాబీ తోటలతో, కొండ లోయలతో ఉండే ఈ పర్వత కేంద్ర సౌందర్యం వర్ణణాతీతం. ఇక ట్రెక్కింగ్ ఇష్టపడేవారికి ఈ కెమ్మనగుండి పర్వత ప్రాంతం నుంచి అనేక మార్గాలు కూడా ఉన్నాయి. ఇక్కడి వివిధ ప్రాంతాల నుంచి సూర్యాస్తమయాన్ని తప్పక చూడాల్సిందే..! ఈ పర్వతం నడిబొడ్డు నుంచి పది నిమిషాల దూరంలోగల "జెడ్ పాయింట్" పశ్చిమ కనుమలలోని శొల గడ్డి భూముల సౌందర్యం మాటల్లో చెప్పలేనిది.

కుద్రేముఖ్ : ఈ ప్రాంతం చిక్‌మగళూరుకు 95 కిలోమీటర్ల దూరంలో నైరుతీ దిశలో ఉంది. ఈ పర్వతశ్రేణులు గుర్రం ముఖం ఆకారంలో ఉండటంవల్ల వాటికి కుద్రేముఖ్ అనే పేరువచ్చింది. ఈ పర్వత కేంద్రంలోనే కుద్రేముఖ్ జాతీయవనం ఉంది. అరేబియా సముద్రంవైపు ఉన్న ఈ పర్వత శ్రేణులు లోతైన లోయలతో, ఎత్తైన శిఖరాలతో చాలా సుందరంగా ఉంటాయి.

ముల్లయనగిరి : ఇది బాబు బుడాన్ కొండలలో ఒక భాగం. ఈ కొండ చిక్‌మగళూరు పట్టణానికి 16 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సముద్ర మట్టానికి 1930 మీటర్ల ఎత్తులో ఉండే ఈ పర్వత శ్రేణులు కర్ణాటక రాష్ట్రంలోనే ఎత్తైన పర్వత శ్రేణులుగా పేరుగాంచాయి. ఈ పర్వత శిఖరం సూర్యాస్తమయం వీక్షించేందుకు ప్రసిద్ధిగాంచింది. ముల్లయనగిరి కొండల నుంచి ఆకాశం నిర్మలంగా ఉన్న రోజులలో అరేబియా సముద్రం కనిపిస్తుంది. పర్వాతారోహకులకు ఇదో మంచి అనువైన ప్రదేశం కూడా.

FILE
దత్తపీఠం లేదా బాబా బుడాన్ గిరి : చిక్‌మగళూరుకి ఉత్తరంలో బాబా బుడాన్ కొండలు ఉన్నాయి. వీటికి "చంద్ర ద్రోణ పర్వత" అనే పేరు కూడా ఉంది. చాలా పురాత చరిత్ర కలిగిన ఈ కొండలు.. హిమాలయా పర్వతాలకు, నీలగిరి కొండలకు మధ్య ఉన్న ఎత్తయిన కొండలలో ఒకటిగా ఇవి పేరుగాంచాయి. ఈ కొండకు 150 సంవత్సరాల క్రితం నివసించిన ముస్లిం ఔలియా మరియు సూఫీ అయిన బాబా బుడాన్ (దాదా హయాత్ కలందర్) వల్ల దత్తపీఠం అనే పేరు వచ్చినట్లు స్థానికుల కథనం.

చిక్‌మగళూరు మాణిక్యధార, కళ్ళహతిగిరి, హెబ్బె, శాంతి, హనుమాన్ గుండి, కదంబి జలపాతాలకు కూడా నిలయం. మాణిక్యధార జలపాతం బుడాన్ గిరి దత్తాత్రేయ పీఠానికి దగ్గర్లో ఉంటుంది. ఈ జలపాతంలో పైనుంచి పడే నీరు ముత్యాల జల్లు పడుతున్నట్లు పర్యాటకులకు అమితానందాన్ని కలిగిస్తుంది.

కెమ్మనగుండి పర్వత కేంద్రానికి పది కిలోమీటర్ల దూరంలో ఉండే కళ్ళహతిగిరి జలపాతానికి కాళహస్తి జలపాతం అని కూడా పిలుస్తుంటారు. 122 మీటర్ల ఎత్తులోని చంద్ర ద్రోణ పర్వతం నుంచి వచ్చిపడే ఈ జలపాతం చాలా రమణీయంగా ఉంటుంది. జలపాతం రాళ్లమధ్య శివుడిగా పూజింపబడే వీరభద్ర దేవాలయం కూడా ఉంది.

అదే విధంగా కెమ్మనగుండి పర్వత కేంద్రానికి పది కిలోమీటర్ల దూరంలోనే ఉన్న మరో జలపాతం హెబ్బె. 168 మీటర్ల ఎత్తునుంచి దుమికే ఈ జలపాతం దొడ్డ హెబ్బ జలపాతంగా, చిక్క హెబ్బె జలపాతంగా రెండు రకాలుగా పడుతుంటుంది. అలాగే కెమ్మనగుండి నుండి జెడ్ పాయింట్కి వెళ్లే మార్గంలో శాంతి జలపాతం కూడా చూపరులను ఇట్టే ఆకర్షిస్తుంది.

హనుమాన్‌ గుండి జలపాతం కలసాకి 32 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ జలపాతంనుండి పడే నీటివల్ల వంద అడుగుల ఎత్తుకంటే ఎత్తయిన సహజ శిలలు ఏర్పడి పర్యాటకులకు అమితానందాన్ని కలుగజేస్తున్నాయి. ఇక చివరగా కుద్రేముఖ్ జాతీయ ఉద్యానవనం వద్దనుండి కదంబి జలపాతం కూడా వీక్షకుల మనసులను రంజింపజేస్తుంది.

అలాగే... ఆది శంకరాచార్యులు అద్వైత ధర్మప్రచారానికి స్థాపించిన మొట్టమొదటి మఠమైన శారదా పీఠానికి నిలయమైన "శృంగేరి", "హొరనాడు", మధ్వాచార్యులు ద్వైత సిద్ధాంతాన్ని బోధించిన "కలప", హిందూ ముస్లింలు సమానంగా పవిత్రంగా పూజించే "గురు దత్తాత్రేయ మరియు బాబా బుడాన్ స్వామి దర్గాహ్", హొయసల రాజులచే నిర్మించబడ్డ "అమృత్‌పుర", "బేలవాడి" దేవాలయం... తదితర పుణ్యక్షేత్రాలు కూడా చిక్‌మగళూరులో చూడదగ్గ పర్యాటక ప్రాంతాలే...!!

వెబ్దునియా పై చదవండి